ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల సడలింపు... వేటికి అనుమతిచ్చారంటే... పూర్తి వివరాలివే...
ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మరింత సడలించింది. 'స్పా'లు,సినిమా థియేటర్లు,ఢిల్లీ మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా థియేటర్లు 50 శాతం అక్యుపెన్సీతో,మెట్రో రైళ్లు 100 శాతం అక్యుపెన్సీతో నిర్వహించేలా అనుమతులు ఇచ్చింది. ఆదివారం(జులై 26) ఉదయం 5గంటల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనెజ్‌మెంట్ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది.
'ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిగింది. కోవిడ్ పేషెంట్ల సంఖ్య,కోవిడ్ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అయితే ఇప్పటికీ కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే.' అని డీడీఎంఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తాజా మార్గదర్శకాల్లో వేటికి అనుమతినిచ్చారు :
అన్ని రకాల మార్కెట్లు,మార్కెట్ కాంప్లెక్సులు,మాల్స్ ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు తెరుచుకుంటాయి.
రెస్టారెంట్లు ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవచ్చు.
బార్లు 50 శాతం కెపాసిటీతో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు.
సినిమా థియేటర్లు,మల్టిప్లెక్సుల్లో 50శాతం అక్యుపెన్సీకి అనుమతి
ఢిల్లీ మెట్రో రైళ్లలో 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతి. నిలబడి ప్రయాణం చేయడాన్ని అనుమతించరు.
వివాహాది శుభ కార్యాలు,అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు కేవలం 100 మందికి అనుమతి.
బస్సులు 100 శాతం అక్యుపెన్సీతో నడిపేందుకు అనుమతి.
అనుమతించబడనివి ఇవే...
స్కూళ్లు,కాలేజీలు,విద్యా సంస్థలు,కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నిర్వహణకు అనుమతి లేదు.
సామాజిక,రాజకీయ,క్రీడా,వినోద,సాంస్కృతి,మతపరమైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అనుమతి లేదు.
కరోనా కేసుల విషయానికి వస్తే శనివారం(జులై 24) ఢిల్లీలో కేవలం 58 కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,041కి చేరింది.