కేటీఆర్ పుట్టినరోజు : లక్షల మందికి మార్గదర్శక శక్తిగా, చిరంజీవి,సోనుసూద్ తోపాటు ప్రముఖుల విషెస్ !!
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ, యంగ్ డైనమిక్ లీడర్ గా సీఎం కేసీఆర్ తనయుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ అందరి మన్ననలను పొందుతున్న కేటీఆర్ ఇటు రాజకీయాల్లోనే కాకుండా, సినీ తారలతోనూ సాహిత్యంగా మెలుగుతున్నారు. ఇక ఈ రోజు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి.

కేటీఆర్ కు జనమడిన శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి
ఇప్పటికే తన బర్త్ డే వేడుకలకు ఎవరు రావద్దని పిలుపునిచ్చిన కెసిఆర్ భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వారు అక్కడే తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ కు రామోజీరావు తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి నాయకత్వం వహించే ధ్రువతారగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టినరోజునే కాదు ప్రతిరోజూ ఆ పని చెయ్యాలని కోరిన చిరంజీవి
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్ లో పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా, ప్రతి సందర్భంలోనూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం చెయ్యాలని కోరారు. దీని ద్వారా రోజురోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కు చెక్ పెట్టాలి. ప్రకృతిని మనం రక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుంది. ముక్కోటి వృక్షార్చన పేరుతో మూడుకోట్ల మొక్కలను నాటడానికి కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు అంటూ చిరంజీవి తన ట్విట్టర్లో వెల్లడించారు. ఇదే సమయంలో కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రి హరీష్ రావు ట్వీట్ .. థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై
తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ముక్కోటి వృక్షార్చన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ చాలెంజ్ లో సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ కూడా పాలుపంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా కేటీఆర్ జన్మదిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కేటీఆర్ గడపాలని ట్వీట్ చేశారు. వారిద్దరూ కలిసి కూర్చున్న ఫోటోను ట్వీట్ చేసారు. ఇక దీనికి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. హరీష్ రావుకు థాంక్స్ బావా అంటూ ట్వీట్ చేశారు.

లక్షల మందికి మార్గదర్శక శక్తిగా ఉండాలని కోరుకుంటున్నాఅంటూ సోను సూద్ ట్వీట్
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోనూసూద్ ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సోనుసూద్, ఈ సంవత్సరం కేటీఆర్ కు అత్యుత్తమంగా ఉండాలని మీ సానుకూల దృక్పథం, మీ దృష్టి ఎల్లప్పుడు లక్షల మందికి మార్గదర్శక శక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. మీరు తనకు మాత్రమే కాదు మీ మొత్తం రాష్ట్రానికి పుట్టిన సూపర్ స్టార్ అంటూ కేటీఆర్ కు సోనూసూద్ కితాబిచ్చారు. ఇదే సమయంలో మిమ్మల్ని ఆలింగనం చేసుకోకుండా ఉండలేవు అంటూ కేటీఆర్ పట్ల ఉన్న తన ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ, వారిద్దరూ కలిసినపుడు తీసిన ఫోటోను ట్వీట్ చేశారు.