ఏపీ కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్...
ఏపీలో 11 కార్పోరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్,75 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండో డిప్యూటీ మేయర్,రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 30న కార్పోరేషన్లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో ప్రత్యేక సమావేశానికి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.
ఏపీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు- ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులు,ఎక్స్‌అఫిషీయో సభ్యులంతా ఆరోజు తప్పక సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ నెల 26వ తేదీలోగా కార్పోరేటర్లు,కౌన్సిలర్లు,ఎక్స్‌అఫిషియో సభ్యులకు సమావేశానికి హాజరుకావాలన్న సమాచారాన్ని చేరవేయాలని కోరారు. ఏలూరు కార్పోరేషన్‌కు కూడా ఈ నెల 30నే మేయర్,ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలోని కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు,మున్సిపాలిటీలు,నగరపంచాయతీల్లో ఇద్దరు వైఎస్ ఛైర్మన్ల నియామకానికి వీలుగా మున్సిపల్ చట్టంలో సవరణలు చేస్తూ ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర కేబినెట్‌లోనూ ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించిన సీఎం జగన్... పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే పంథాను అనుసరించారు. మేయర్,డిప్యూటీ మేయర్,మున్సిపల్ ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ పదవులకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువమందికి పదవులు ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.