వివేకా హత్య కేసు కొలిక్కి-8 మంది హస్తం-8 కోట్ల సుపారీ-ఇద్దరు ప్రముఖులు ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించింది. కొన్ని నెలలుగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. వందలాది మంది సాక్ష్యుల్ని విచారించింది. చివరికి ఈ హత్య వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని గుర్తించింది. అలాగే ఈ హత్యకు పాల్పడిన హంతకులు, వారికి అందిన సుపారీ వివరాలను కూడా సేకరించింది. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వివేకా ఇంటి వాచ్ మెన్ ను హాజరుపరిచిన సీబీఐ కీలక వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఇప్పుడు ఈ కేసులో ఈ వాంగ్మూలమే కీలకంగా మారింది.

వివేకా హత్య కేసులో సీబీఐ బ్రేకింగ్
ఏఫీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటివరకూ దాదాపు 1600 మందిని పలు దఫాలుగా విచారించిన సీపీఐ. కీలక ఆధారాలను సంపాదించింది. ఇందులో వివేకా హత్యలో పాల్గొన్న వారితో పాటు వారి వెనుక ఉన్న వారి గురించి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. సీబీఐ సేకరించిన ఈ వివరాలు వివేకా హత్య కేసుకు కీలక టర్నింగ్ పాయింట్ గా చెప్తున్నారు.

వివేకా హంతకులు వారే
మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసింది ఐదుగురుగా సీబీఐ నిర్ధారించినట్లు తెలుస్తోంది. తాజాగా వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యను పలుమార్లు ప్రశ్నించి వివరాలు రాబట్టిన సీబీఐ...ఆయన వాంగ్మూలాన్ని స్ధానిక జమ్మలమడుగు మెజిస్ట్రేట్ వద్ద రికార్డు చేయించింది. ఇందులో ఆయన వివేకా హత్య జరిగిన సమయంలో అక్కడ ఐదుగురు ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరే హంతకులుగా సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

వివేకా హత్యకు రూ.8 కోట్ల సుపారీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు పాల్పడిన హంతకులకు రూ.8 కోట్ల సుపారీ లభించినట్లు వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సుపారీ తీసుకుని హత్యకు పాల్పడిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం. వీరంతా హత్య తర్వాత పారిపోయారని తెలుస్తోంది. ఈ ఐదుగురు హంతకులతో పాటు మరికొందరు వ్యక్తులు కూడా వీరికి సాయం చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది.

వివేకా హత్య వెనుక ఇద్దరు ప్రముఖులు ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యవెనుక ఇద్దరు ప్రముఖులు ఉన్నట్లు వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ గుర్తించింది. వీరిద్దరూ కిరాయి హంతకులతో కలిసి ఈ హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు హంతకులతో పాటు మరో వ్యక్తి కూడా పాలుపంచుకున్నట్లు తెలిసింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉంటారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేస్తే కానీ ఆ ఇద్దరు ప్రముఖుల వివరాలు బయటికి వచ్చే అవకాశం లేదు. దీంతో త్వరలో సీబీఐ దాఖలు చేసే ఛార్జిషీట్ పైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.