ట్విట్టర్ పై కేంద్రం మరోసారి ఫైర్- ఐటీ రూల్స్ తో భావప్రకటన స్వేచ్ఛకు భంగం లేదని వెల్లడి
దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ ను అమలు చేసే విషయంలో కేంద్రంతో పోరాటం చేస్తున్న సోషల్ దిగ్గజం ట్విట్టర్ తాజాగా భారత్ లో భావప్రకటనా స్వేచ్ఛను తెరపైకి తెచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై ట్విట్టర్ ప్రశ్నలు జనం దృష్టి మళ్లించేందుకేనని తేల్చిచెప్పింది.
కొత్త ఐటీ రూల్స్ నుంచి తప్పించుకునేందుకు దేశంలో భావప్రకటనా స్వేచ్ఛతో పాటు తమ ఉద్యోగుల భద్రతను ట్విట్టర్ తెరపైకి తెస్తోందని కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇవాళ పార్లమెంటుకు తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం గ్యారంటీ ఇస్తోందని, దాన్ని ఏదో ఒక సంస్ధ నియంత్రించడం సాధ్యం కాదన్నారు. దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ వ్యవస్ధల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.


దేశంలో కొత్త ఇంటర్నెట్ నిబంధనలు మే 26న అమల్లోకి వచ్చినా ట్విట్టర్ మాత్రం ఇప్పటికీ వాటిని పూర్తిగా అమలు చేయడం లేదని కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంటులో తెలిపారు. ఈ దేశంలో అమల్లో ఉన్న అన్ని చట్టాల్ని ట్విట్టర్ అమలు చేయాల్సిందేనన్నారు. తాజాగా భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ట్విట్టర్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్రమంత్రి తప్పుబట్టారు. దేశంలో ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న ఐటీ చట్టం కానీ, దాని నిబంధనలు కానీ భావప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించవన్నారు.