తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు: కేంద్రమంత్రి వెల్లడి, ఎక్కడెక్కడ అంటే..?
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు..
తెలంగాణలో కొత్తగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెన్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్టును ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పూర్తి చేసిందని, ఈ నివేదికను జులై 7న తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సమర్పించిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

ఇంకా స్థల ఎంపిక అనుమతులివ్వని తెలంగాణ సర్కారు..
ప్రతిపాదిత మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు సంబంధించిన స్థల ఎంపిక అనుమతులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర పౌర విమానయానశాఖకు ఇవ్వలేదని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

కొత్తగూడెంకు విమానాశ్రయం అవసరం ఎంతో ఉంది..
కాగా, అత్యధిక విస్తీర్ణం గల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నికల్ సర్వే బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. విమానాశ్రయం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంతోపాటు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో సింగరేణి బొగ్గు గనులు, సారపాకలో ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, మణుగూరు-పినపాక మండలాల సరిహద్దులో బీటీపీఎస్ వంటి పెద్ద పారిశ్రామిక సంస్థలకు నిలయంగా భద్రాద్రి కొత్తగూడెం ఉంది. భద్రాద్రి రాముడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేగాక దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు.

కొత్తగా దేశీయ విమానాశ్రయాలను ఫేస్-1, ఫేస్-2లో ఏర్పాటు
తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే సేవలందిస్తోంది. బేగంపేట విమానాశ్రయం శిక్షణకు, ప్రముఖుల రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరికొన్ని విమానాశ్రయాల అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రతిపాదనలున్న విమానాశ్రయాలతోపాటు మొత్తం ఆరు విమానాశ్రయాలను ఏర్పాటుకు సానుకూలమని కేంద్రం ప్రకటించింది. వరంగల్, ఆదిలాబాద్, బసంత్‌నగర్(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్), పాల్వంచ(కొత్తగూడెం జిల్లా), దేవరకద్ర(మహబూబ్‌నగర్)లలో కొత్తగా దేశీయ విమానాశ్రయాలను ఫేస్-1, ఫేస్-2లో ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు సాగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే.. తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.