కరోనా..అదుపులోనే ఉన్నా: భయపెడుతోన్న డెల్టా వేరియంట్..థర్డ్‌వేవ్ ముప్పు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో తగ్గుదల కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ సంఖ్యలో కేసులు నమోదవుతోన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ కొంత ఆందోళనను కలిగిస్తోన్నప్పటికీ.. దాని పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి. నియంత్రణ చర్యలను తీసుకుంటోన్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తూ వస్తోన్నాయి. ఫలితంగా- దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో అదుపులోనే ఉంటోంది.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా..ఆయనే: రేపట్నుంచే పార్లమెంట్: గరంగరం
ఆగస్టు చివరివారంలో థర్డ్‌వేవ్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 41,157 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి దాదాపు సమానంగా డిశ్చార్జీలు నమోదయ్యాయి. 42,004 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మరణాల సంఖ్యలో తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 518 మంది మృతిచెందారు. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. 4,22,660గా నమోదయ్యాయి. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 4,13,609కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,24,115, బ్రెజిల్-5,41,323 మంది మరణించారు. ఆ తరువాతి స్థానం భారత్‌దే.
మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 40,49,31,715 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. కరోనా తీవ్రతను నివారించడానికి ఢిల్లీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా సరోజిని మార్కెట్‌ను మూసివేసింది. దీనితో మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఇవ్వాళ సమావేశం కానున్నారు. కరోనా ప్రొటోకాల్స్‌ను పాటిస్తామంటూ ఢిల్లీ ప్రభుత్వానికి వినతిపత్రాన్ని అందజేసే అవకాశం ఉంది.