సిక్కోలులో మామా, అల్లుళ్ల వార్-జగన్ మందుతో తమ్మినేని పిచ్చి మాటలు-కూన ఫైర్
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా అముదాల వలస నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలు, మామా-అల్లుళ్లు కూడా అయిన స్పీకర్ తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా అల్లుడు కూనపై తమ్మినేని చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన ఘాటుగా బదులిచ్చారు.
కూన రవికుమార్ ను తొక్కేస్తానంటూ స్పీకర్ తమ్మినేని తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సీఎం జగన్ అమ్మే పిచ్చిమందు ఏవో స్పీకర్ సీతారాం తాగినట్లున్నారని, తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని కూన రవికుమార్ తెలిపారు. జగన్ అమ్మే పిచ్చి బ్లాండ్లను తాగడం తగ్గిస్తే సీతారాంకు మంచి మాటలు వస్తాయని కూన హితవు పలికారు. తాజాగా మొక్కలు కార్బన్ డయాక్సైడ్ వదులుతాయంటూ స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా కూన గుర్తు చేశారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం నన్ను కాలితో తోక్కేస్తామంటున్నారని, అది ఆయన అబ్బతరం కూడా కాదని కూన రవికుమార్ తెలిపారు. నా కాలీ వేలు మీద ఏంట్రుక కూడా పీకలేవ్ అంటూ తమ్మినేనిపై విరుచుకుపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూన హెచ్చరించారు. కొత్త గా ఓక్క ప్రాజెక్ట్ కూడా నియోజకవర్గానికి తీసుకు రాలేదని, ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఇసుక దందా చేస్తున్నారని తమ్మినేనిపై కూన విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఉండకపోతే... నీ బండారం బయటపెడతా అని ఆయన హెచ్చరించారు. ఇంటర్ కూడా చదవని సీతారాం కేవలం జగన్ వలన స్పీకర్ గా పనిచేస్తున్నారని కూన ఎద్దేవా చేశారు.