కరోనా వ్యాక్సిన్ మూడో డోసు తప్పదా... ఎందుకీ ఎక్స్‌ట్రా డోసు... ఆ దేశాల్లో ఇప్పటికే అనుమతి...
కరోనా వ్యాక్సినేషన్‌పై ఇప్పటివరకూ రకరకాల వాదనలు,చర్చలు తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డోసులు,వ్యాక్సిన్ మిక్సింగ్,వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్... వీటిపై భిన్న వాదనలు వ్యక్తమయ్యాయి. తాజాగా మరో ఆసక్తికర వాదన తెర పైకి వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను మూడు డోసుల్లో ఇవ్వడం ద్వారా మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మూడు డోసుల వ్యాక్సినేషన్ ప్రతిపాదన ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

మూడో డోసు ఎందుకు..?
అమెరికా వ్యాక్సిన్ కంపెనీలు ఫైజర్,బయోఎన్‌టెక్ మూడు డోసుల పద్దతిలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాల అనుమతి కోరనున్నట్లు వెల్లడించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ కంటే మూడు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి మరింత ఉత్తేజితం అవుతుందని ఆ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసుల వ్యాక్సిన్ ద్వారా తీవ్రమైన కోవిడ్ నుంచి కనీసం ఆర్నెళ్ల పాటు రక్షణ ఉంటుందని... అయితే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో కొంత కాలానికి దాని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి.

మెడికల్ ఏజెన్సీలు ఏమంటున్నాయి...
ఇప్పటికైతే మెడికల్ ఏజెన్సీలేవీ మూడో డోసును సిఫారసు చేయలేదు. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ,యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ దీనిపై స్పందిస్తూ... మూడో డోసు గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నాయి. వ్యాక్సినేషన్‌కి సంబంధించి ఇప్పటివరకూ సమగ్ర డేటా అందుబాటులో లేదని... కాబట్టి వ్యాక్సిన్ ప్రభావాన్ని,దానివల్ల కలిగే రక్షణను మొదట అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపాయి.
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ దిదియర్ హౌసిన్ మాట్లాడుతూ... మూడో డోసు ప్రతిపాదనకు తగిన ఆధారాలేవీ లేవని అన్నారు. ఇప్పటికీ చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని... ఇలాంటి తరుణంలో మూడో డోసు ప్రతిపాదనను తీసుకొస్తే వ్యాక్సిన్‌పై లేనిపోని అపోహలు,ఆందోళన వ్యక్తమవుతాయని హెచ్చరించారు.

ఏయే దేశాల్లో మూడో డోసు
మూడో డోసుపై భిన్న వాదనలు వినిపిస్తుండగానే కొన్ని దేశాలు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో ఫ్రాన్స్,ఇజ్రాయెల్,హంగేరీ దేశాలు ఉన్నాయి. హంగేరీలో అగస్టు నుంచి,ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ నుంచి మూడో డోసు ఇవ్వనున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి,అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్నవారికి,క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి మూడో డోసు ఇవ్వనున్నారు. 80ఏళ్ల వయసు ఉన్నవారికి మూడో డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వ్యాక్సినేషన్ కౌన్సిల్ తెలిపింది. కోవిడ్ వ్యాప్తిని బట్టి త్వరలోనే యువతకు కూడా మూడో డోసు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది.