సోను సూద్ కోసం టీవీ పగలగొట్టిన ఏడేళ్ళ బుడతడు .. స్పందించిన రియల్ హీరో
రీల్ లైఫ్ విలన్ గా అందరికీ సినిమాల ద్వారా పరిచయమున్న సోను సూద్, కరోనా మహమ్మారి కాలంలో చేసిన సేవలతో రియల్ లైఫ్ హీరోగా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అయ్యారు. భారత దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో, తన ఆస్తిపాస్తులను సైతం తనఖా బెట్టి సోనూసూద్ ప్రజలను రక్షించడం కోసం ఎంతగానో కృషి చేశారు.
సోను సూద్ ను కలిసిన నర్సంపేట వాసి .. శాలువాతో సన్మానించిన రియల్ హీరో !!

సినిమాలో విలన్ అయిన సోనుసూద్ ను కొడుతున్న సీన్ .. తట్ట్టుకోలేకపోయిన బుడతడు
సహాయం అని అర్ధించిన ప్రతి ఒక్కరికి, కాదు, లేదు అనకుండా తన వంతు సహాయం చేశారు. సూద్ పౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన దేవుడు అయ్యారు. ఇక అలాంటి సోనూసూద్ కోసం ఓ ఏడేళ్ళ బుడతడు చేసిన పని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన అభిమాన నటుడు సోనూసూద్ ను ఓ చిత్రంలో హీరో కొడుతున్న సీన్ చూసిన ఏడేళ్ల బుడతడు అది చూసి తట్టుకోలేక, సోనూసూద్ ని కొట్టిన వారిని రాయితో కొట్టాలనుకొని, టెలివిజన్ ను రాయితో కొట్టేసాడు. దీంతో టీవీ కాస్త పగిలిపోయింది.

కోపంతో టీవీ రాయితో పగలగొట్టిన ఏడేళ్ళ విరాట్
తెలంగాణాలోని సంగారెడ్డి న్యాకల్ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల విద్యార్థి విరాట్ చేసిన పని ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా సోనూసూద్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఏడేళ్ల చిన్న పిల్లాడికి కూడా సోను సూద్ మంచివాడని అర్థమైంది. అందుకే సినిమాలో విలన్ గా నటించిన ప్పటికీ రియల్ లైఫ్ లో హీరో గా భావిస్తున్న ఏడేళ్ల విరాట్ సోనూసూద్ ని దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు కొడుతుంటే తట్టుకోలేకపోయాడు. కోపంతో ఏకంగా టీవీనే పగలగొట్టేశాడు.

విరాట్ టీవీ పగలగొట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న సోను సూద్ స్పందన
సోనూసూద్ సినిమాల్లో కూడా హీరోగా చూడాలని, సోనూసూద్ నిజంగా హీరో అని ఆ పిల్లవాడు చెబుతున్నాడు. తండ్రి అది కేవలం సినిమా అని చెప్పే ప్రయత్నం చేసేలోగా టీవీని బద్దలుకొట్టి సోనూసూద్ పై తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు. ఇక ఈ వీడియో క్లిప్ ను చూసిన సోను సూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ వీడియో క్లిప్ పోస్ట్ చేసి బుడతడి అభిమానానికి ఆశ్చర్యపడిన సోను సూద్ అరె బేటా మీ టీవీలను పగులగొట్టవద్దు.. మీ నాన్న వచ్చి ఇప్పుడు తనకు కొత్త టీవీ కొనిపెట్టమని నన్ను అడుగుతారేమో అంటూ సోషల్ మీడియా లో ట్వీట్ చేసారు.

కరోనా సమయంలో చేసిన సేవలతో సోను సూద్ కు విపరీతమైన ఇమేజ్
ఏది ఏమైనా చిన్న పిల్లవాడి దగ్గర్నుండి పండు ముసలి వాళ్ళ వరకు దేశవ్యాప్తంగా సోనూసూద్ అభిమానులను సొంతం చేసుకున్నారని ఈ ఉదంతంతో స్పష్టంగా అర్థమవుతుంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన నిజ జీవిత హీరో ఇమేజ్ వైరల్ అయినందున, తాను ఇకపై నెగటివ్ రోల్స్ చేయనని సోను ప్రకటించాడు. ప్రజల కోసం ఆపన్న హస్తం అందిస్తూ , ఆపద్బాంధవుడిగా కరోనా కష్టకాలంలో సోను సూద్ చేసిన సేవలు ఆయనకు విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టాయి.