వైసీపీని తరుముతున్న సీబీఐ-జడ్డీలపై సోషల్ పోస్టులపై-కడపలో తొలి అరెస్ట్, కస్డడీ
ఏపీలో గతేడాది వైసీపీ వర్సెస్ హైకోర్టుగా సాగిన పోరులో గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తుల్ని, వారి తీర్పుల్ని తప్పుబడుతూ సోషల్ మీడియా పోస్టులు వెలిశాయి. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసిన సీబీఐ.. అప్పట్లో పోస్టులు పెట్టిన వారిపై కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే నిందితులతో ఓ భారీ లిస్టు తయారు చేసిన సీబీఐ.. తాజాగా కడప నుంచి అరెస్టులు ప్రారంభించింది. దీంతో అప్పట్లో కోర్టు తీర్పులపై కామెంట్లు చేసిన వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర తెలుసుకునేందుకు సీబీఐ అరెస్టు చేసిన నిందితుల్ని కస్టడీలోకి తీసుకుంది.

హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియా పోస్టులు
గతేడాది హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులు, అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత సీజే జస్టిస్ ఎన్వీ రమణ సహకారంతో ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ గత సీజే బాబ్డేకు లేఖ రాశారు. అప్పట్లో ఈ లేఖ సంచలనంగా మారింది. అదే సమయంలో హైకోర్టు తీర్పుపై వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు రెచ్చిపోయారు. సర్కారుకు ప్రతికూలంగా వచ్చిన తీర్పుల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా లెక్క చేయలేదు. చివరికి సోషల్ మీడియా పోస్టుల నుంచి రోడ్లపై బ్యానర్లు పెట్టే వరకూ వచ్చేశారు.

సీబీఐ దర్యాప్తుతో వైసీపీకి చుక్కలు
హైకోర్టు జడ్డిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరుకు చెందిన న్యాయవాది లక్షీనారాయణ చేసిన ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు విచారణ చేపట్టింది. తొలుత స్ధానిక పోలీసులు, ఆ తర్వాత సీఐడీ దర్యాప్తు మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వం ఆధీనంలో ఉండే సీఐడీ విచారణ ముందుకు సాగకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఈ పోస్టులు, వాటి మూలాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ... నిందితులతో భారీ జాబితానే తయారు చేసింది. ఇందులో ఒక్కొక్కరిగా అరెస్టులు చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వ పెద్దలతో వీరికి ఉన్న సంబంధాలను కూడా వెలికితీసే ప్రయత్నాల్లో ఉంది.

కడపలో సీబీఐ తొలి అరెస్టు
న్యాయమూర్తుల్ని దూషించిన కేసులో సీబీఐ తయారు చేసిన నిందితుల జాబితా పెద్దదే ఉంది. అయితే ఇందులో 15వ నిందితుడిని సీబీఐ ముందుగా అరెస్టు చేసింది. అదీ కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే తొలి 14 మంది నిందితుల్ని వదిలి సీబీఐ 15వ నిందితుడిని అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే స్ధానిక కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తద్వారా ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రం కడపేనా అన్న ప్రచారం మొదలైంది. రెండు రోజుల కస్టడీలో రాజశేఖర్ రెడ్డి నుంచి సీబీఐ మరిన్ని వివరాలు రాబట్టబోతోంది.

ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరా
హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల వెనుక ఎవరున్నారనే అంశంపై సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు, కీలక స్ధానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి వీరికి ఏమైనా సూచనలు అందాయా అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించిన సీబీఐ అధికారులు.. రాజశేఖర్ రెడ్డి కస్టడీలో మరిన్ని కోణాలు వెలికి తీసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ సానుభూతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.