India
oi-Rajashekhar Garrepally
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసింది. దీంతో దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్ తీసుకొచ్చారు.
అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అమెరికా దళాలు వెనక్కి వెళ్లడంతో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు కీలక భూభాగాలను ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఆఫ్ఘనిస్థాన్‌లో మూసివేశాయి.

కాగా, దక్షిణ ప్రాంతంలో కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా ఉగ్ర మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ భద్రతా బలగాలతో భీకర యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
తాలిబన్ల సాయంతో లష్కరే తొయిబా ఉగ్రవాదులు కూడా మరింతగా రెచ్చిపోయి భీకర దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాలిబన్లు, లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఆఫ్గాన్ దళాలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి కూడా ఉగ్రమూక నుంచి ముప్పు పొంచివున్న క్రమంలో భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్‌కు రప్పించినట్లు తెలుస్తోంది.
English summary
Indian Government temporarily closed its consulate in Kandahar: staff returned to india, amid Taliban attacks in Afghanistan.
Story first published: Sunday, July 11, 2021, 13:07 [IST]