
సెక్షన్ 66ఏకు సుప్రీంకోర్టు బ్రేక్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపించే వారిపై వాడుతున్న ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏపై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సెక్షన్ ను వాడొద్దని 2015లోనే తీర్పు ఇచ్చినా ఇంకా పలు రాష్ట్రాలు దీన్ని ప్రయోగించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తక్షణం ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే ఈ రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా ఉందంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ బయటపెట్టారు.

సెక్షన్ 66ఏపై జగన్ కు రఘురామ లేఖాస్త్రం
2015లో సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేసినా ఇంకా ఏపీలో ఈ సెక్షన్ కింద కేసులు నమోదు కావడాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు సీఎం జగన్ కు ఇవాళ లేఖ రాశారు. ఏపీలో ఇంకా సెక్షన్ 66 కింద కేసులు పెట్టడంపై పౌరసమాజం, హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయని రఘురామ తెలిపారు. 2015లోనే సుప్రీంకోర్టు కొట్టేసిన ఈ సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదు కావడంపై సుప్రీంకోర్టు తాజాగా ఆక్షేపించింది. కానీ ఏపీలోనూ ఇంకా ఎన్నో కేసులు ఈ సెక్షన్ కింద నమోదు చేస్తున్నారని రఘురామ తెలిపారు.

సెక్షన్ 66ఏ కింద ఏపీలో 38 కేసులు
సుప్రీంకోర్టు రద్దు చేసిన సెక్షన్ 66ఏ కింద తాజాగా ఈ ఏడాది మార్చిలోనూ పోలీసులు కేసులు పెట్టారని రఘురామరాజు సీఎం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు. రద్దయిన సెక్షన్ కింద ఆరేళ్ల తర్వాత కూడా కేసులు నమోదు కావడం మన చట్ట వ్యవస్ధ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తోందని, సుప్రీంకోర్టు ఈ సెక్షన్ రద్దు చేసిన ఆరేళ్ల తర్వాత ఏపీలో 38 కేసులు ఈ సెక్షన్ కింద నమోదయ్యాయని రఘురామ తెలిపారు. ఈ సెక్షన్ కింద విశాఖలో సీఐడీ అరెస్టు చేసిన నలంద కిషోర్.. వందల కిలోమీటర్లు పోలీసులు తిప్పిన తర్వాత మానసిక, శారీరక ఇబ్బందులతో కరోనాతో పోరాడి చనిపోయారని రఘురామ తెలిపారు.
గతేడాది గుంటూరులో రంగనాయకమ్మ కూడా ఓ సోషల్ మీడియా పోస్టు ఫార్వార్డ్ చేసిందన్న కారణంతో ఇదే సెక్షన్ వాడారని తెలిపారు.. దీంతో పాటు ఆమెకు వర్తించని సెక్షన్ 505, 120బీ కూడా వాడారని రఘురామ ఆరోపించారు.

జగన్ సర్కార్ పై సుప్రీంకోర్టు ధిక్కారం
సెక్షన్ 66ఏ కింద అక్రమ కేసుల నమోదు ఆపకపోతే వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని రఘురామ తన లేఖలో సీఎం జగన్ ను హెచ్చరించారు.. సెక్షన్ 66 కేసుల నమోదు ఆపకపోతే సుప్రీంకోర్టే కోర్టు ధిక్కారం కింద మన పోలీసులపై సుమోటో కేసులు నమోదు చేసే అవకాశముందని రఘురామ పేర్కొన్నారు. తక్షణం ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన జగన్ సర్కారును డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారులు తమ ఇష్టానుసారం కాకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరుతున్నా. ఈ మేరకు సీఎస్, డీజీపీలకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ ను రఘురామ కోరారు. అధికారులు నిర్మాణాత్మక విమర్శలను గుర్తించాలిని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నస్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయో గమనించాలని ఆయన కోరారు.

చట్టం రాకుండానే దిశ స్టేషన్లు, యాప్ వాడతారా ?
మహిళలపై అకృత్యాల నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం దిశ బిల్లు తీసుకొచ్చిందని, దీనికి కేంద్రం ఆమోదం లభించకముందే 18 పోలీసు స్టేషన్లు, దిశ యాప్ ప్రారంభించడాన్ని రఘురామ తప్పుబట్టారు. దీన్నిబట్టి మన పోలీసుశాఖ వ్యవహారాలు ఓ దిశా దశా లేకుండా సాగుతున్నట్లు అర్ధమవుతోందన్నారు. దిశ యాప్ ను అమల్లోకి తీసుకురావడం వల్ల మహిళలకు జరిగే మేలు కన్నా ఇలా దీన్ని వాడుతూ అక్రమంగా కేసులు నమోదు చేస్తే అది తీవ్రమైన చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని రఘురామ హెచ్చరించారు. సీఎం తాడేపల్లి ఇంటికి దగ్గర్లోనే జరిగిన అత్యాచారం నిందితుల్ని ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారని, .కానీ దిశ చట్టం ప్రకారం డెడ్ లైన్లు పెడుతున్నారని రఘురామ ఆక్షేపించారు.. శిక్షలు విధించేందుకు కోర్టులకు డెడ్ లైన్లు పెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించదన్నారు.

ఫోన్లలో రఘురామ ఫొటోల తొలగింపు
తన నియోజకవర్గం నరసాపురంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఫోన్లలో పెట్టుకున్న తన ఫొటోల్ని తొలగించేలా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని డీఫాక్టో హోంమంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని రఘురామ ఆరోపించారు. ఫోన్లలో నా ఫొటో తీయించగలరు కానీ వారి హృదయాల్లో నా ఫొటోను ఎప్పటికీ తొలగించలేరన్నారు.. అదృష్టవశాత్తూ వారి హృదయాల్లో ఉన్న నా ఫొటో వీరికి కనిపించడం లేదని రఘురామ ఎద్దేవా చేశారు.. కనిపిస్తే దాన్ని కూడా తీసేయమంటారన్నారు. ఇలాంటి చర్యలపై ఎవరూ కోర్టులకు వెళ్లడం లేద కానీ వెళ్తే మాత్రం పోలీసులకు తమ నియంతృత్వ చర్యలపై ఇబ్బందులు తప్పవని రఘరామ పేర్కొన్నారు.