ఆనందపురం గ్రామ సచివాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసిన మందుబాబు
జీ సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో ఫుల్లుగా మందేసిన వెంకటరమణ అనే ఓ వ్యక్తి మద్యం మత్తులో గ్రామ సచివాలయం పై దాడి చేశాడు. అక్కడ ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన సచివాలయ సిబ్బందిపై కూడా దాడికి తెగబడ్డాడు. నోటికి వచ్చినట్టు పరుష పదజాలంతో అందరిని దూషించాడు. మా పార్టీ, మా ప్రభుత్వం, మా ఇష్టం అంటూ రెచ్చిపోయాడు. అతన్ని కంట్రోల్ చేయలేకపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీస్ స్టేషన్ లోనూ వీరంగం .. మా అధికారం మా ఇష్టం అంటూ ..
ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా పోలీస్ స్టేషన్ లోనూ హంగామా సృష్టించాడు సదరు మందుబాబు . మా ప్రభుత్వం ,మా పాలన, మా ఇష్టం… అడ్డొస్తే పోలీసులనైనా సరే నరికి పారేస్తామంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు. ఇక ఈ తాగుబోతును కట్టడి చేయడానికి పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. అయితే అతను చేసిన వ్యాఖ్యల పైన స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇది రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు అవుతున్న తీరు అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసి సెటైర్లు వేస్తూ మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ చేసిన వ్యాఖ్యలను సైతం ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
మద్య నిషేధంపై ఏపీ సర్కార్ దృష్టి .. కానీ మందుబాబుల తీరు ఇలా !!
ఏదేమైనా మద్యపానం పై ఉక్కుపాదం మోపడం కోసం మద్యనిషేధ విధానాన్ని అంచెలంచెలుగా అమలు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్ కు ఈ మందు బాబులను కంట్రోల్ చేయడం, పూర్తిగా మద్యాన్ని నిషేధించడం పెద్ద పనే అని చెప్పాలి.గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా తాగుబోతుల నుండి విన్నపంతో కూడిన ఒక డిమాండ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చింది . కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ లో 29 వ వార్డుల బ్యాలెట్ బాక్స్ లలో మందుబాబులు తమ డిమాండ్స్ తో స్లిప్పులు వేశారు.
గతంలోనూ బ్రాండ్ల కోసం ఏకంగా ఎన్నికల్లోనే మందుబాబుల హంగామా
గతంలో ఎన్నికల సమయంలో మందు బాబుల స్లిప్పులు అధికారులను ఒక్కసారి షాక్ కు గురి చేశాయి. ఇక స్లిప్పులలో ఉన్న విషయం చదివిన అధికారులు ఆ ఆసక్తికర విన్నపంపై అవాక్కయ్యారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ లిక్కర్ బ్రాండ్స్ కోసం తమ విన్నపాన్ని తెలియజేశారు మందుబాబులు . కొత్త బ్రాండ్ లను తొలగించి పాత లిక్కర్ బ్రాండ్లను అమ్మాలని తమ విన్నపం అంటూ పేర్కొన్న నంద్యాల తాగుబోతులు లేకపోతే మా చివరి ఓట్లు ఇవే కాగలవని విన్నవించుకుంటున్నాము అంటూ విజ్ఞప్తితో కూడిన హెచ్చరికలు జారీ చేశారు.