Telangana
oi-Lekhaka
వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 8వ తేదీన షర్మిల తెలంగాణ రాజన్న రాజ్యం లక్ష్యంగా వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల వైఎస్సార్ అభిమానులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక, తెలంగాణలో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం రాజకీయంగా అన్నకు మద్దతుగా షర్మిల పాదయాత్ర..ఎన్నికల ప్రచారం చేసినా పార్టీ నడపాలంటే ఎత్తులు..పై ఎత్తులు..వ్యూహాలు అవసరం. అందునా రాజకీయంగా వ్యూహాల దిట్ట కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే వ్యూహకర్త అవసరమని షర్మిల గుర్తించారు.
ఇందు కోసం ఏపీలో తన అన్నతో పాటుగా అనేక రాష్ట్రాల్లో పలువురికి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీంనే ఇప్పుడు షర్మిల సైతం నమ్ముకున్నారు. ప్రశాంత కిషోర్ తాను రాజకీయ వ్యూహకర్తగా ఇక పని చేయనని స్పష్టం చేసారు. దీంతో…ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన సీనియర్లు కోరుకున్న పార్టీలకు వ్యూహకర్తలుగా మారుతున్నారు. అందులో భాగంగా… పీకే టీంలో సీనియర్ గా ఉన్న ఒక మహిళా స్ట్రాటజిస్ట్ ప్రియా తన టీంతో సహా షర్మిల కోసం పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళనాడు డీఎంకే తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియ. ఈ రోజు షర్మిలతో సమావేశమై తన టీంను పరిచయం చేసారు.

పార్టీ ఏర్పాటు రోజు నుండే షర్మిల రాజకీయ వ్యూహాలు… ప్రత్యర్ధి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు.. ఏ అంశం మీద స్పందించాలి..పబ్లిక్ మూడ్ తెలుసుకోవటం వంటి వాటి విషయంలో సహకారం అందిచనున్నారు. పార్టీ బలోపేతం..సోషల్ మీడియా వినియోగం… ప్రత్యర్ధి పార్టీల పైన ఎదురుదాడి..రాజకీయ స్లోగన్స్.. పాదయాత్ర సమయంలో చేయాల్సిన ప్రసంగాలు..ప్రజలు కోరుకుంటున్న అంశాల వంటి విషయంలో మహిళా స్ట్రాటజిస్ట్ ప్రియా తన టీంతో కలిసి పని చేయనున్నారు. ప్రియా స్వయంగా ఒక మీడియాకు అధినేతగా ఉండటంతో…మీడియా మేనేజ్ మెంట్ తో పాటుగా ఏ రకంగా ప్రచారాలు నిర్వహించాలనే దాని పైన షర్మిలకు రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు.
ఇక, పూర్తిగా సెంటిమెంట్ … సామాజిక సమీకరణాలే తెలంగాణ రాజకీయాలను డిసైడ్ చేస్తాయి. దీంతో..రాజకీయాల్లో పండి పోయిన కేసీఆర్ ఒక వైపు… ఫైర్ బ్రాండ్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డి మరో వైపు.. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీ ఇంకో వైపు..ఇలా మూడు పార్టీలతో ఒక్కో రకంగా షర్మిల ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇక, వైఎస్సార్ అభిమానులను షర్మిలకు వదిలేయటానికి రేవంత్ రెడ్డి సిద్దంగా లేరనే విషయం స్పష్టమవుతోంది.
అదే సమయంలో షర్మిలకు రెడ్డి వర్గం అండగా ఉంటుందనే వాదన సమయంలో..రేవంత్ రెడ్డి వర్గం తన వైపే ఉండేలా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో..తెలంగాణలో కేసీఆర్ తో పాటుగా..షర్మిల తోనూ మైండ్ గేమ్ ప్రారంభించారు. దీంతో..ఇప్పుడు తెలంగాణలు అసలు ఆట మొదలు కాబోతోంది. షర్మిల నమ్ముకుంటున్న వ్యూహకర్త లతో ఏ మేర ఫలితాలు సాధిస్తారో…కేసీఆర్ – రేవంత్ లను ఎలా ఎదుర్కొంటారో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. తన లక్ష్యా సాధన దిశగా షర్మిల అడుగులు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.
English summary
YS Sharmila seek assistance of Prashant Kishor’s team for political strategies in Telagana to face KCr and Revanth reddy.
Story first published: Friday, July 2, 2021, 19:36 [IST]