India
oi-Rajashekhar Garrepally
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు జరిపేందుకు పశ్చిమబెంగాల్ వెళ్లిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్సీ) బృందంపై దుండగులు దాడి చేశారు.
జాదవ్‌పూర్‌లో కొంతమంది అల్లరిమూకలు తమపై దాడి చేశారని ఎన్‌హెచ్ఆర్సీ అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరపాలని ఎన్‌హెచ్ఆర్సీని కోల్‌కతా హైకోర్టు జూన్ 18న ఆదేశించింది.

ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడేందుకు మంగళవారం జాదవ్‌పూర్ వెళ్లారు. దర్యాప్తులో 40 ఇళ్లు దగ్ధమైనట్లు తాము గుర్తించామని సదరు అధికారి వెల్లడించారు. తృణమూల్ పార్టీకి చెందిన గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది సిగ్గుమాలిన చర్య అని, దీంతో బెంగాల్‌లో ఏం జరుగుతోందనే విషయం తెలిసిపోతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పర్యటనకు రాలేదని, కోర్టు ఆదేశాల మేరకే వచ్చిందన్నారు.
అయితే, ఎవరిపైనా దాడి జరగలేదని టీఎంసీ చెబుతోంది. జాతీయ సంస్థల తరపున వచ్చిన ఏ ఒక్కరిపైనా దాడి జగరదు. ఎన్‌హెచ్ఆర్సీ బృందంపై ఎవరు ఎందుకు దాడి చేస్తారని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా అన్నారు. ఇప్పటికే బెంగాల్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై పెద్ద దాడి చేశారంటూ వ్యాఖ్యానించారు.
English summary
NHRC team attacked in West Bengal during visit to probe post-poll violence
Story first published: Wednesday, June 30, 2021, 1:29 [IST]