Andhra Pradesh
oi-Syed Ahmed
రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా తెలంగాణ మంత్రులు చేస్తున్న వరుస విమర్శలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యల్ని వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఇవాళ ఖండించారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై రామచంద్రయ్య తీవ్ర అభ్యంతరం తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం సున్నితమైన అంశమని, దీనిపై తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్సి కూడా అయిన రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కృష్ణా నది నుంచి తమకు కేటాయించిన జలాల్నే వాడుకుంటున్నామని, అంతకు మించి వాడుకోవడం లేదన్నారు. కొత్త ప్రాజెక్టేమీ నిర్మించడం లేదన్నారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూీ ప్రజల్ని మంత్రులు రెచ్చగొడుతున్నారని రామచంద్రయ్య ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ తన మంత్రుల్ని నియంత్రించాలన్నారు.

ఇరు రాష్ట్రాల్లో సంపూర్ణ సాగు ప్రాజెక్టులకు జలయజ్ఞం ద్వారా లక్షల కోట్లు కేటాయించి నిర్మించిన ఘనత మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని రామచంద్రయ్య అన్నారు. ఆయన్ను నిందిస్తూ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మంత్రుల వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ ఎనలేని కృషి, పోరాటం చేశారన్నారు. గతంలో ప్రజా ప్రస్ధానం పాదయాత్రను తెలంగాణలోని చేవెళ్ల నుంచే ప్రారంభించారని, దీన్ని ఆ ప్రాంత నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రాంతం చూడకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించారని రామచంద్రయ్య గుర్తుచేశారు. ఇచ్చం పల్లె, కాళేశ్వరం ప్రాజెక్టు ను సాకారం చేసింది దివంగత నేత వైఎస్ అని రామచంద్రయ్య తెలిపారు. అప్పట్లో అక్కడి నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి ని ఆకాశానికి ఎత్తేశారని గుర్తుచేశారు. వైఎస్ పై విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు.
English summary
ysrcp mlc c.ramachandraiah on today slams telangana ministers over their deretgatory remarks agiainst rayalaseema lift irrigation scheme and late cm ysr.
Story first published: Monday, June 28, 2021, 13:22 [IST]