Telangana
oi-Rajashekhar Garrepally
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు, అందులో ఉండే గేమ్స్, వీడియో గేమ్స్ చాలా మంది పిల్లలకు వ్యసనాలుగా మారుతున్నాయి. వాటికి బానిసలా మారిపోతున్నారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నిరాశే ఎదురవుతోంది. తాజాగా, ఇలాంటి ఘటనే ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగీత్‌నగర్‌లో నివసించే ఆనంద్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మణికంఠ(12) ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో అతనికి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు.
ఇంట్లో తల్లిదండ్రులు, అన్నయ్య ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని మణికంఠ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ వద్ద ఉన్న మొబైల్‌లో వీడియో గేమ్ ఓపెన్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీడియో గేమ్‌లు చూస్తూనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే, వీడియో గేమ్స్ ఆడొద్దని కుటుంబసభ్యులు వారించిన నేపథ్యంలో బాలుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
నీటిలో పడి నలుగురు మృతి
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. లోతైన నీటిలో మునిగి నలుగురు మృతి చెందారు. బీర్కూరు శివారులోని చౌడమ్మ కయ్యలో నలుగురు మునిగి ప్రాణాలు కోల్పోయారు. బీర్కూర్ నుంచి బిచ్‌కుంద్ మండలం చెట్లూరు వెళ్తూ.. మంజీరా నది దాటుతుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతదేహాలు లభించగా, మరొకరి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.
English summary
A boy allegedly commits suicide in Hyderabad due to video game.
Story first published: Saturday, June 26, 2021, 17:55 [IST]