ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేసాడు అశోక్ గజపతి
ఇక తాజాగా మరోమారు ఘాటు విమర్శలతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేసాడు అశోక్ గజపతి అంటూ మధ్యలో ఎన్టీఆర్ ను తీసుకొచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే పార్టీ నుంచి ఎన్టీఆర్ గెంటేసిన వారిలో అశోక్ గజపతి ఒకరిని పేర్కొన్నారు. ఇక పార్టీ నుంచి గెంటేసిన వారిలో మొదటి పేరు బాబుది అయితే రెండవ పేరు అశోక్ దని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ శాసనసభ్యత్వాన్నీ రద్దు చేయాలంటూ అప్పటి స్పీకర్ కు లేఖ రాస్తే ఆయనపై చెప్పులు కూడా విసిరాడు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్తచరిత్ర
అశోక్ గజపతి ది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్తచరిత్ర అంటూ విజయ సాయి రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇదే సమయంలో సతీసహగమనం, వరకట్నం, బహుభార్యత్వం, కుటుంబ ఆచారం అంటే చట్టం ఒప్పుకుంటుందా ? స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోనూ లేదంటే చెల్లుతుందా అశోక్ అంటూ ప్రశ్నించిన ఆయన స్త్రీలకు ఆస్తి హక్కు తమ పూసపాటి రాజ్యాంగంలో లేదని చెబితే చట్టం ఒప్పుకోదు అని స్పష్టం చేశారు.
ఏ బై లా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలి
ఏ బై లా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశించిందని పేర్కొన్న విజయ సాయి రెడ్డి ఈ రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలవరం కల సాకారానికి ఒక్కడుగు దూరమే మిగిలిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి జగన్ పట్టుదలతో రేయింబవళ్లు లాక్ డౌన్ సమయంలో కూడా నిర్మాణ పనులు కొనసాగించటం వల్ల కొద్ది నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది అంటూ వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్ట్ పై విజయసాయి వ్యాఖ్యలు
క్రెస్ట్ గేట్ల ద్వారా గోదావరి ప్రవాహం జాలువారుతున్న దృశ్యం అద్భుతంగా ఉంది అంటూ త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారు అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఒకపక్క ఏపీ సర్కార్ చేస్తున్న వివిధ కార్యకరమాలకుసంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తూనే నిత్యం ప్రతిపక్ష పార్టీ నాయకులతో సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి చెడుగుడు ఆడుతున్నారు .