సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన మహిళకు అస్వస్థత
అయితే, ఈ సహపంక్తి భోజనం అనంతరం పలువురు అస్వస్థతకు గురయ్యారు. సీఎం పక్కనే కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయిన తర్వాత బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. అదేరోజు రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
బాలికతోపాటు మరో 17 మందికి వాంతులు, విరేచనాలు
ఆగమ్మ ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు. కాగా, బుధవారం ఓ బాలిక అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం బాలికను ఇంటికి పంపించారు. గ్రామంలో మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధ పడుతుండటంతో వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.
వాసాలమర్రిలో ఇంటింటికీ వైద్య పరీక్షలు
ఈ క్రమంలో బుధవారం ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైనవారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. గ్రామస్తుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని, సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొనగా.. కేవలం 18 మంది మాత్రం అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. తీసుకున్న ఆహరం పడకపోవడం వల్లే ఇలా జరిగివుంటుందని వెల్లడించారు. కాగా, వాసాలమర్రిలో మంగళవారం సీఎం సహపంక్తి భోజనాలతోపాటు బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
బంగారు వాసాలమర్రి.. ఆదర్శం కావాలంటూ కేసీఆర్ పిలుపు
మంగళవారం పర్యటన సందర్భంగా వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. ఆ గ్రామంపై వరాలు కురిపించారు. గ్రామస్తులతో సరదాగా సంభాషించారు. బంగారు వాసాలమర్రి అయ్యేవరకూ తాను ఇక్కడికి వస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. గ్రామ ప్రజలంతా ఇందుకు తమ సహకారం అందించాలని అన్నారు. ఇతర గ్రామాలకు వాసాలమర్రి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కేసీఆర్ వరుస పర్యటనలు చేస్తున్నారు.