ఎత్తేసిన జగన్‌ కేసులివే- సుమోటో విచారణపై సర్కార్‌ ఆక్షేపణ-రేపు హైకోర్టు తీర్పు

జగన్‌ కేసుల ఉపసంహరణపై హైకోర్టు విచారణ

జగన్‌ కేసుల ఉపసంహరణపై హైకోర్టు విచారణ

ఏపీలో సీఎం జగన్‌పై గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన 11 క్రిమినల్‌ కేసుల్ని తప్పుడు కేసులు, సాక్ష్యాలు లేని కేసులంటూ వైసీపీ సర్కార్‌ ఉపసంహరించుకుంది. దీనిపై సుమోటాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇందులో ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వం, సీఎం జగన్ తరఫు వాదనలు నిన్న విన్న తర్వాత ఈ కేసు విచారణ వాయిదా వేసింది.

అయితే హైకోర్టు సుమోటో విచారణపై ప్రభుత్వం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. దేశంలో ఇలా హైకోర్టు క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్ల సుమోటో విచారణ చేపట్టడం ఇదే తొలిసారని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

హైకోర్టు విచారణపై సర్కార్‌ అభ్యంతరాలివే

హైకోర్టు విచారణపై సర్కార్‌ అభ్యంతరాలివే

జగన్‌పై గతంలో నమోదైన 11 కేసులపై తాజాగా హైకోర్టు సుమోటో విచారణ చేపట్టడంపై అడ్వకేట్ జనరల్‌ శ్రీరాం సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. జస్టిస్‌ లలిత ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన హైకోర్టు చర్యపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కేసుపై నోటీసులు జారీ చేస్తామన్న హైకోర్టు నిర్ణయంపైనా అభ్యంతరం తెలిపారు. నోటీసులు జారీ చేసే ముందు కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గతంలోఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు.హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ, సింగిల్‌ జడ్జి ముందు ఆ పిటిషన్లను పెట్టడం, ఆ సింగిల్‌ జడ్జి సుమోటోగా తీసుకోవడం అన్నది న్యాయప్రక్రియకు విరుద్ధమని ఆయన వాదించారు. సీఆర్పీసీలో సెక్షన్‌ 397, సెక్షన్‌ 401 కింద పిటిషన్లను నమోదు చేశారని, సెక్షన్ 397 పూర్తిగా జ్యడిషియల్‌ అధికారాల పరిధిలోనిదని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టులో రోస్టర్‌ కూడా జ్యుడిషియల్‌ పరిధిలోని అంశమేనని, ఉన్నత న్యాయస్ధానం సంప్రదాయాల్ని పాటించాలని కోరారు. జ్యుడిషియల్‌ అధికారాలను హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ అతిక్రమించిందని, కమిటీ నిర్ణయాలు టీవీ చర్చల్లో మాత్రమే కనిపించాయని ఏజీ తెలిపారు. తనకు తానుగా ఈ వ్యహారాన్ని కోర్టు ముందు ఉంచడానికి రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు అధికారం లేదని, ఈ మొత్తం వ్యవహారం సీఆర్పీసీకి విరుద్ధంగా నడుస్తోందన్నారు.

 జగన్‌పై నమోదైన క్రిమినల్ కేసులివే

జగన్‌పై నమోదైన క్రిమినల్ కేసులివే

2016 మార్చి 9న జగన్‌ వర్గవైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారని మంగళగిరి రూరల్ పీఎస్‌లో కసు నమోదైంది. అదే ఏడాది జూన్‌ 3న అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన రైతు భరోసా యాత్రలో జగన్‌.. చంద్రబాబు గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలని జనాన్ని రెచ్చగొట్టారు. అదే రోజు అనంతపురం జిల్లాలోని పెదవడగూరు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై జనాన్ని రెచ్చగొట్టారంటూ మరో క్రిమినల్‌ కేసు నమోదైంది.

అదే రోజు పుట్టపర్తిలో పర్యటించిన జగన్.. ప్రజల్నిరెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని అర్బన్‌ పీఎస్‌లో మరో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత ఇదే జిల్లా కదిరిలో జరిగిన రైతు భరోసా యాత్రలో చంద్రబాబును చచ్చేనరకూ చెప్పులతో కొట్టమని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నల్లచెరువు స్టేషన్లో జగన్‌పై కేసు నమోదైంది. అదే ఏడాది జూన్‌ 6న అనంతపురం సప్తగిరి సర్కిల్లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో చంద్రబాబుపై జగన్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టూటూన్ పీఎస్‌లో కేసు నమోదైంది.

అలాగే హైకోర్టు సుమోటో విచారణ పరిధిలోకి రాని మరో నాలుగు కేసులున్నాయి. వీటిలో పులివెందులలో 2011 అక్టోబర్‌ 9న అల్లర్లకు పాల్పడటం, మారణాయుధాలు కలిగి ఉండటం, ప్రభుత్వ ఉద్యోగి విధుల్ని అఢ్డుకోవడం వంటి ఆరోపణలపై జగన్‌పై కేసు నమోదైంది.

2015 జూన్ 8న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం వంటి కేసులు జగన్‌పై నమోదయ్యాయి. అదే రోజు నరసరావుపేట వన్‌టౌన్‌ పీఎస్‌లో ఇవే ఆరోపణలతో మరో కేసు నమోదైంది. 2017 ఫిబ్రవరి 28న కృష్ణాజిల్లా నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సందర్భంగా పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌ను బెదిరించినందుకు జగన్‌పై మరో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *