జగన్ అక్రమాస్తుల కేసులకు ఆర్ధిక నేరగాళ్ళ కేసులకు లింక్ పెట్టిన టీడీపీ నేత
మొదటి నుండి జగన్ అక్రమాస్తుల కేసులపై విరుచుకు పడుతున్న టిడిపి తాజాగా దేశంలో వైట్ కలర్ మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచిన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్ ను చేర్చి మాటల తూటాలను పేలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రం జగన్ కేసుల విచారణ వేగవంతం చేయడం లేదని అటు బీజేపీని సైతం టార్గెట్ చేస్తోంది. తాజాగా యనమల రామకృష్ణుడు వివిధ ఆర్థిక కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ల ఆస్తులను ఈడీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని, ఈ ముగ్గురి కేసుల్లో చూపిస్తున్న వేగం సీఎం జగన్ కేసుల్లో లేకపోవడం శోచనీయమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన వారితో జగన్ కు పోలికా ?
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోపీ వేసి వేల కోట్ల రూపాయలను దండుకుని, విదేశాలకు చెక్కేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు మినహాయించి, మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా అప్పులు తీసుకుని బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టడం, విదేశాలకు పారిపోవడం వంటి ఆరోపణలు ఏవీ లేవు. అయినప్పటికీ దేశానికి కుచ్చుటోపీ పెట్టిన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్ ను చేర్చి టిడిపి నేత యనమల చేస్తున్న విమర్శలు ఒకింత షాకింగ్ అనే చెప్పాలి .
దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అంటూ వ్యాఖ్యలు .. అలా అయితే బీజేపీ వదిలిపెడుతుందా ?
అంతేకాదు జగన్ కు చెందిన 43 వేల కోట్ల అక్రమ సంపాదన అంతా స్వాధీనం చేసుకొని ప్రజా పరం చేయాలని కూడా యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జగన్ ఆర్థిక నేరాల విచారణ లో ఏళ్ల తరబడి జాప్యం చేయడం తగదని పేర్కొన్న ఆయన, వెంటనే చర్యలు చేపడితే ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు. వందకు పైగా కంపెనీలు, 108 మంది వ్యక్తులు, నలుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, ఐదుగురు ఉన్నతాధికారుల గూడుపుఠాణీ తో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం జగన్ చేశారని యనమల ఆరోపించారు. అతి పెద్ద ఆర్ధిక కుంభకోణం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జగన్ కేసులపై దృష్టి పెట్టకుండా ఉంటుందా ? అన్నది ఒక ప్రశ్న.
జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులను అస్త్రంగా మలుచుకున్న టీడీపీ
స్వల్ప కాలంలోనే పదకొండు వందల రెట్లు అవినీతి సంపద పెరగడం పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి విస్తుపోయారు అని గుర్తు చేసిన యనమల రామకృష్ణుడు ఇప్పటికే 43 వేల కోట్ల అక్రమాస్తులలో దాదాపు పది వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిన కారణంగా, అక్రమ సంపాదనను ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.జగన్ ను టార్గెట్ చెయ్యటానికి జగన్ పై ఉన్న కేసులను అస్త్రంగా మలుచుకున్న టీడీపీ నేతలు ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
జగన్ దూకుడు తట్టుకోలేకనే ఇలాంటి ఆరోపణలు .. అంటున్న వైసీపీ
తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల పై విచారణ వేగవంతం చేయాలని ఒత్తిడి తెస్తున్న క్రమంలో జగన్ ను దేశంలోని బ్యాంకులను ముంచిన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చేరుస్తూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి దూకుడును తట్టుకోలేకనే , పలు సంక్షేమ పథకాల అమలులో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మింగుడు పడకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. యనమలా .. ఇది తగునా అని ప్రశ్నిస్తున్నారు.