కర్నూలు టీడీపీ నేతలను దారుణంగా హతమార్చారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 27 మంది టిడిపి నేతలను అతి దారుణంగా చంపారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లోకేష్. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్న ఇద్దరు నాయకులైన అన్నదమ్ములను అత్యంత దారుణంగా వేట కొడవలితో నరికి హతమార్చడం దారుణమన్నారు.
గ్రామాన్ని అభివృద్ధి చెయ్యటమే వాళ్ళు చేసిన పాపమా ? కర్నూలులో లోకేష్
ఇదే సమయంలో కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చిన లోకేష్ వైసిపి వాళ్లు టిడిపి నేతలు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని పశువుల్లా చంపారని,20 ఏళ్ల పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళు చేసిన పాపమా అంటూ ప్రశ్నించారు. నాగేశ్వర్ రెడ్డికి లైసెన్స్ గన్ ఉందని, పంచాయతీ ఎన్నికలకు ముందు దాన్ని తీసుకున్నారని పేర్కొన్నా లోకేష్. ఎన్నికల తర్వాత తిరిగి గన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకవేళ అది ఉంటే ఇంత దారుణం జరిగేది కాదంటూ ఆరోపించారు.
గతంలో ఇలాగే చేసిన వాళ్ళ గతి ఏమైందో గుర్తు చేసుకోండి
టిడిపి నేతలను ఇద్దరిని హతమార్చి 24 గంటలు అవుతున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్టు చేయలేదని లోకేష్ ప్రశ్నించారు. ఈ హత్యల వెనుక ఉంది వైసీపీ నాయకులే అన్నారు. గతంలో రాజా రెడ్డి ,వైఎస్ఆర్ కూడా టీడీపీ శ్రేణులను చంపించారని, వాళ్ల గతి ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు లోకేష్. హత్యలపై దమ్ముంటే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి అన్నారు. ఈ హింసా రాజకీయాలు ఇంకెంతకాలం అని ప్రశ్నించారు.
మేం సింహాల్లాంటి వాళ్ళం వదిలిపెట్టం అని వార్నింగ్
రాష్ట్రంలో టీడీపీ కీలక నేతలు అచ్చెన్నాయుడు , ప్రభాకర్ రెడ్డి , ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి తదితర నేతలపై అన్యాయంగా దొంగ కేసులు పెడుతున్నారని, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయ్యా మేము సింహం లాంటి వాళ్లు మిమ్మల్ని వదిలిపెట్టం వేటాడుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయాలని సూచించిన లోకేష్, చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కారణంగానే టిడిపి నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. వైసిపి నాయకులు ప్రస్తుతం చేస్తున్న దాడులకు తగిన సమాధానం కచ్చితంగా చెప్తామని తేల్చి చెప్పారు.