సీరో నుంచి వీరో కణాలు… వ్యాక్సిన్ తయారీకి…
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీకి వివిధ రకాల బోవిన్ (ఆవు, గేదె), ఇతర జంతువుల సీరంను వేరో కణాల పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీకి ఇది ప్రామాణిక పదార్థంగా చెబుతున్నారు.
సీరం ద్వారా అభివృద్ది చేసిన వీరో కణాలను మాత్రమే వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తారు.వీరో కణాల శుద్దికి ప్రత్యేక పద్దతులు ఉంటాయి. ఆ ప్రక్రియలో లేగ దూడ లేదా ఇతర జంతువుల నుంచి సేకరించిన సీరం ఆనవాళ్లు తొలగిపోతాయి. పోలియో, రేబిస్, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ల తయారీకి ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీలో లేగదూడల సీరం ఉపయోగిస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.
కోవాగ్జిన్ తయారీ ఇలా…
కోవాగ్జిన్ తయారీలో కోవిడ్ 19 వ్యాధికి కారణమయ్యే SARS-CoV-2 క్రియా రహిత వైరస్‌ను ఉపయోగించి వ్యాక్సిన్ అభివృద్ది చేస్తారు.వ్యాక్సిన్ ద్వారా దాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా రోగనిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అయితే ఆ క్రియా రహిత వైరస్‌ను వ్యాక్సిన్‌లో ఉపయోగించాలంటే, ప్రయోగశాలలో దాన్ని అభివృద్ది చేయాల్సి ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి కణజాలాలలో ఉండే స్థితిని పున:సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ల పెరుగుదలకు ల్యాబ్‌లో అనువైన పరిస్థితులను కల్పిస్తారు. అదే సమయంలో వైరస్ అభివృద్దికి అవసరమయ్యే పోషకాలను అందించడానికి ఆవులు,గుర్రాలు,మేకలు,గొర్రెలు లేదా ఇతర జంతువుల నుంచి సేకరించిన కణజాలాన్ని ఉపయోగిస్తారు.
ఆవుల సీరమే ఎందుకు…
అలా సేకరించిన కణజాలాన్ని ఉపయోగించి వైరస్‌ను వృద్ది చేస్తారు. ఆ తర్వాత పలు దశల్లో దాన్ని శుద్ది చేసి వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తారు. శుద్ది ప్రక్రియ తర్వాత అందులో జంతు కణజాలానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు కనిపించవు. సాధారణంగా వ్యాక్సిన్ల తయారీకి అవసరయ్యే వీరో కణాల అభివృద్దికి ఆవుల నుంచి సీరంను సేకరించడానికి కారణం.. అవి ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండటమేనని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. పైగా ఆవుకు సంబంధించిన సీరంలో అమినో యాసిడ్లు,సుగర్,గాలక్టోజ్ వంటి పోషక పదార్థాలను ఉంటాయని తెలిపింది.
మరో పద్దతిలోనూ వ్యాక్సిన్ తయారీ…
చారిత్రకంగా మరో పద్దతిలోనూ వ్యాక్సిన్ల తయారీకి జంతువుల సీరంను ఉపయోగిస్తున్నారు. డిఫ్తీరియా వ్యాక్సిన్‌లో యాంటీబాడీ సప్లిమెంట్‌గా గుర్రపు సీరంను 100 ఏళ్లుగా వాడుతున్నారు. ఈ పద్దతిలో మొదట గుర్రాలకు చిన్న మోతాదులో బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత గుర్రం శరీరంలో డిఫ్తీరియాను ఎదుర్కొనే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. ఆ యాంటీబాడీలను సేకరించి వాటిని వ్యాక్సిన్ తయారీలో వాడుతారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీ పద్దతికి ఇవే పద్దతులను అనుసరిస్తున్నారు.