
అశోక్ గజపతిరాజు కాలి గోటికి కూడా విజయసాయిరెడ్డి సరిపోడు
ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేశారు . దీంతో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలి గోటికి కూడా విజయసాయిరెడ్డి సరిపోడని తీవ్రంగా విరుచుకు పడుతున్నారు టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు. అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని ఆయన పేర్కొన్నారు .ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత లేని విజయసాయిరెడ్డి ఇప్పటికే ఎన్నో తప్పులు చేశారని విమర్శించారు.

రాజు గారి భూములు తీసుకున్నారని మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా?
అశోక్ గజపతిరాజు పుట్టింది రాజవంశంలో అయినా ఎలాంటి దర్పాన్ని ప్రదర్శించని గొప్ప నాయకుడని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో రాజు గారి భూములు తీసుకున్నారని మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. ఎలా పడితే అలా విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు పై మాట్లాడితే ఉత్తరాంధ్ర ప్రజలు సహించరని పేర్కొన్నారు. అసలు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల విషయంలో విజయసాయిరెడ్డికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.

అధికారుల తీరు మారాలి , రాజకీయాలతో మీకేం సంబంధం
సింహాచల అప్పన్న దర్శనానికి వెళ్లిన అశోక్ గజపతిరాజు పట్ల ఆలయ అధికారులు వ్యవహరించిన తీరు సరికాదన్న పల్లా శ్రీనివాసరావు, అధికారుల తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారులు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ రగడ ఏ రూపు తీసుకుంటుందో వేచి చూడాలి .