మాన్సాస్‌ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్‌ -దోపిడీదారులంటూ ఫైర్‌-రాజరికం చెల్లదన్న వెల్లంపల్లి

 మాన్సాస్‌ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్‌

మాన్సాస్‌ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్‌

పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టుకు టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు మరోసారి ధర్మకర్త(ఛైర్మన్‌)గా బాధ్యతలు చేపట్టారు. గతేడాది మార్చిలో వైసీపీ ప్రభుత్వం తన అన్న ఆనంద్‌ కుమార్తె సంచైతను తెరపైకి తెచ్చిన నేపథ్యంలో పదవి కోల్పోయిన అశోక్… హైకోర్టు తీర్పుతో మరోసారి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు మాన్సాస్‌ ఛైర్మన్‌గా తిరుగులేకుండా వ్యవహరించిన అశోక్.. హైకోర్టు తీర్పుతో బాధ్యతలు చేపట్టాక సంచైత హయాంలో జరిగిన వ్యవహారాలన్నీ సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.

 దోపిడీదారులకు మాన్సాస్‌లో చోటులేదన్న అశోక్‌

దోపిడీదారులకు మాన్సాస్‌లో చోటులేదన్న అశోక్‌

మాన్సాస్‌ ఛైర్మన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అశోక్‌.. ప్రభుత్వంతో పాటు సంచైతపైనా నిప్పులు చెరిగారు. మాన్సాస్‌, సింహాచలం బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన అశోక్‌కు నిన్న సింహాచలం ఆలయంలో అధికారులు సంప్రదాయంగా వచ్చే తలపాగా చుట్టలేదు. దీనిపై స్పందించిన అశోక్.. అధికారులు భయపడితే ప్రయోజనం లేదన్నారు. వారిని సహకరించాలని కోరారు. పారదర్శకతతో ముందుకు వెళ్తామన్నారు. మాన్సాస్‌ సిబ్బందికి గతంలో ఎందుకు జీతాలు ఇవ్వలేదని అఫ్పటి ఛైర్మన్‌ సంచైతను అశోక్‌ ప్రశ్నించారు. కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాన్సాస్‌లో కొన్నేళ్లుగా ఆడిట్ జరగలేదని నిన్న ఎంపీ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దీనిపై తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్‌ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. దోపిడీ దారులకు మాత్రం మాన్సాస్‌లో చోటు లేదన్నారు.

 రామతీర్ధంలో అవమానంపై అశోక్‌ ఆవేదన

రామతీర్ధంలో అవమానంపై అశోక్‌ ఆవేదన

రామతీర్ధం ఆలయ ఛైర్మన్‌ హోదాలో ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ట కోసం తాను పంపిన చెక్‌ను వెనక్కి పంపి ప్రభుత్వం మానసిక క్షోభకు గురి చేసిందని అశోక్‌ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఛైర్మన్‌గా ఉన్న తనను విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదన్నారు. తద్వారా పూసపాటి రాజవంశీయుల పరిధిలో ఉన్న ఆలయాల విషయంలో ప్రభుత్వం తనను ఎలా వేధించిందో అశోక్ గజపతిరాజు గుర్తుచేసుకున్నారు.

 రాజరికం చెల్లదంటూ వెల్లంపల్లి కౌంటర్‌

రాజరికం చెల్లదంటూ వెల్లంపల్లి కౌంటర్‌

మాన్సాస్‌ ట్రస్టు విషయంలో అశోక్‌ గజపతిరాజు చేస్తున్న విమర్శలపై స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా బదులిచ్చారు. అన్న కుమార్తెను ఛైర్మన్‌గా చేస్తే అశోక్‌ తట్టుకోలేకపోయారన్నారు. పంచగ్రామాల భూసమస్యకి అశోక్ గజపతిరాజు సానుకూలమా, వ్యతిరేకమా అన్నది చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్‌ చేశారు. అశోక్ హయాంలో మాన్సాస్ ట్రస్ట్‌లో జరిగిన అవకతవకలు బయటపెడతామని వెల్లంపల్లి హెచ్చరించారు. రాజులం కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకోవద్దన్నారు. రాజరిక పాలన పోయిందంటూ అశోక్‌కు చురకలు అంటించారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *