ఫాలో కాకుండానే డేటా చోరీ..
సోషల్ మీడియాలో యూజర్ల సెక్యూరిటీపై అనేక అనుమానాలు, రోజుకో రకం ఉదంతాలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. ప్రొఫైల్ లాక్ చేసుకునే సదుపాయాన్ని టెక్ కంపెనీలు కల్పిస్తున్నప్పటికీ, ఆయా యాప్స్ లోని చిన్న చిన్న బగ్స్ సైబర్ నేరగాళ్ల పాలిట వరంలా మారుతున్నాయి. అలాంటి ఓ బగ్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాడు మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల యువకుడు మయూర్ ఫర్తాడే. అతను కనిపెట్టిన బగ్ సాధారణమైనదేమీకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు ఖాతాలను ఫాలో కాకుండానే యూజర్ల ఫొటోలు, వివరాలు దొంగిలించి, బ్లాక్ మెయిల్ చేయడం, వేధింపులకు పాల్పడడం వంటి నేరాలకు వీలు కల్పించే అవకాశమున్న బగ్ అది. దాని వల్ల సైబర్ నేరస్తులకు ఎలాంటి మేలు జరుగుతుందో గుర్తించిన మయూర్.. ఆ విషయాన్ని రుజువులతో సహా ఇన్‌స్టా మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ కు తెలియజేశాడు.
LJP ముసలం: గాయపడ్డ సింహం బిడ్డను -బాబాయి పశుపతికి BJP అండపై Chirag Paswan విస్మయం
ప్రమాదాన్ని గుర్తించిన మయూర్
సోలాపూర్‌కు చెందిన మయూర్ ఫర్తడే కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాలో సైబర్ నేరగాళ్లు ఎలా అవతలి వ్యక్తుల పోస్టులను చూడగలరో పేర్కొన్నాడు. ఈ బగ్ ద్వారా ప్రైవేట్ ఇన్‌స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కివ్డ్ పోస్టులు, స్టోరీలు, రీల్స్ తదితర వివరాలను పొందేందుకు అవకాశం ఉందని గుర్తించాడు. వ్యక్తుల పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చని కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన డెవలపర్ లైబ్రరీలోని గ్రాఫ్‌క్యూఎల్ అనే టూల్‌ను ఉపయోగించి బ్రూట్ ఫోర్స్‌డ్ మీడియా ఐడీని ఎంటర్ చేయడం ద్వారా సదరు పోస్ట్ తాలూకా లింక్, పోస్ట్ వివరాలు పొందొచ్చన్న విషయాన్ని గుర్తించాడు.
బగ్ బౌంటీకి రూ.22 లక్షల రివార్డు..
ప్రమాదకర బగ్ ను కనిపెట్టిన విషయాన్ని మయూర్ గత నెలలో ఫేస్‌బుక్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ సంస్థ ఇంజనీర్లు పరిశీలించి, మయూర్ చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే మయూర్ ను అభినందిస్తూ ఫేస్‌బుక్ ఒక సందేశాన్ని పంపింది. ప్రమాదకరమైన బగ్‌ను కనుగొన్నందుకు గానూ రూ.22 లక్షల రివార్డును కూడా అందజేసింది. మంగళవారం(జూన్ 15న) ఆ డబ్బులు మయూర్ ఖాతాలో పడ్డాయి. భవిష్యత్‌లోనూ ఇలాంటి లోపాలుంటే గుర్తించి పంపించాలని ఫేస్ బుక్ కోరగా, బగ్ బౌంటీ(బగ్‌ల వేట)ని ఇకపైనా కొనసాగిస్తానని, దాన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగంగా భావిస్తానని, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలన్నదే తన లక్ష్యమని మయూర్ బదులిచ్చాడు.