
కరోనాకు సీజన్ తో సంబంధం లేదు
2020 వ సంవత్సరం నుండి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. గతేడాది ఫస్ట్ వేవ్ లో చాలామంది కరోనా బారినపడి ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా, ప్రాణాలను కోల్పోయారు. ఇక సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా రావడంతో లక్షల్లో ప్రజలు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నా సీజన్ తో సంబంధం లేకుండా కరోనా మహమ్మారి ఎప్పుడైనా సోకే ప్రమాదముందని, ఏడాది అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ క్యాలెండర్లో వివరించారు.

సీజనల్ వ్యాధుల క్యాలెండర్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ .. కరోనాపై అలెర్ట్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతం వర్షాకాలం సీజన్ రావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో, కరోనా మహమ్మారి గురించి కూడా ప్రజలను అలర్ట్ గా ఉండాలని చెప్పడం గమనార్హం. సహజంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు , వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. జూలై నుండి అక్టోబరు మధ్యకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

వ్యాక్సిన్లు తీసుకున్నా మాస్కులు ధరించటం , కరోనా రూల్స్ పాటించటం చెయ్యాల్సిందే
ఆ తర్వాత నవంబర్ నుండి మార్చి మధ్య స్వైన్ ఫ్లూ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎండాకాలంలో నుంచి జూన్ మధ్య వడదెబ్బ కొట్టడం, మలేరియా రావడం వంటి అవకాశాలుంటాయి. అయితే సీజనల్ వ్యాధుల విషయం పక్కన పెడితే కరోనా మహమ్మారి మాత్రం ఏడాది పొడుగునా వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ క్యాలెండర్ లో వివరించింది . అందుకే అందరూ వ్యాక్సిన్లు తీసుకోవటం త్వరితగతిన పూర్తి చేయాలని, వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం తప్పక చేయాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సెకండ్ వేవ్ నుండి రిలీఫ్ అవుతున్న సమయంలో షాకింగ్ న్యూస్
కరోనా సెకండ్ వేవ్ నుండి ఉపశమనం పొందుతున్న తెలంగాణ ప్రజలకు, థర్డ్ వేవ్ తో సంబంధం లేకుండా కరోనా మహమ్మారి ఎప్పుడైనా ఎవరికైనా ప్రబలే అవకాశం ఉందని, కరోనాకు సీజన్ తో పనిలేదని చెప్పడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు అప్రమత్తంగా ఉండకుంటే మహమ్మారి పంజా విసిరే అవకాశం ఉంటుంది. అందుకే సీజన్ ఏదైనా సరే.. కరోనా మహమ్మారి విషయంలో తస్మాత్ జాగ్రత్త.