
అసలేం జరిగింది…
కేరళలోని వదక్కన్‌చెరి గ్రామానికి చెందిన విగ్నేష్ కృష్ణ టిక్‌టాక్‌లో ‘అంబిలి’ అనే పేరుతో పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల ఓ బాలికతో సోషల్ మీడియా ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇద్దరూ తరచూ ఫోన్లు చేసుకునేవారు. ఆ తర్వాత బయట కలుసుకోవడం మొదలుపెట్టారు. అలా ఓరోజు బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో… విగ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

గర్భం దాల్చిన బాలిక
పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా… ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెల్లిక్కులంగర పోలీసులను ఆశ్రయించి విగ్నేష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇంతలో తనపై కేసు పెట్టారన్న విషయం తెలుసుకున్న విగ్నేష్ ఇంటి నుంచి పరారయ్యాడు.

పక్కా స్కెచ్‌తో రంగంలోకి పోలీసులు
విగ్నేష్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతని కుటుంబ సభ్యులు,స్నేహితులను ఆరా తీశారు. అయినా ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. ఇదే క్రమంలో విగ్నేష్ విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఓ ప్లాన్ రచించారు. విగ్నేష్ పాస్‌పోర్ట్ సిద్దమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా అతని కుటుంబానికి సమాచారమిచ్చారు. అదే రోజు రాత్రి విగ్నేష్ తండ్రి తన ఇంటి నుంచి బైక్‌పై ఎక్కడికో బయలుదేరగా… పోలీసులు అతన్నే ఫాలో అయ్యారు.

ఇలా దొరికిపోయాడు….
తిరూర్ పట్టణంలో ఉన్న ఓ ఇంట్లోకి అతను వెళ్లడం గమనించారు. అతని వెనకాలే ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు… అదే ఇంట్లో విగ్నేష్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. పాస్‌పోర్ట్ విషయం చెప్పేందుకే విగ్నేష్ తండ్రి అక్కడికి వెళ్లినట్లు గుర్తించారు. విగ్నేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెను చెల్లి అని సంబోధిస్తూనే అతను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.