మోదీ-యోగి 75 నిమిషాలు ఏకాంత భేటీ-ఏం చర్చించారు-ఆ సంకేతాలు పంపించేందుకేనా…?

ఏయే అంశాలు చర్చకు…

మోదీ-యోగి మధ్య దాదాపు 75 నిమిషాల పాటు ఏకాంత భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ మేనేజ్‌మెంట్,పలు అభివృద్ది పనులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో యూపీ సర్కార్ పని తనాన్ని మోదీ మెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఇద్దరి మధ్య భేటీకి సంబంధించి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో… యూపీలో కోవిడ్ పరిస్థితులపై సీఎం యోగి ప్రధానికి వివరించినట్లుగా పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో ట్రేస్-టెస్ట్-ట్రీట్ మోడల్‌ను పక్కాగా అమలుచేసి సత్ఫలితాలు సాధించామని యోగి తెలిపారు. ప్రస్తుతం యూపీలో కరోనా నియంత్రణలో ఉందని చెప్పారు. కరోనా సమయంలో 23 లక్షల మంది పేదలకు ప్రతీ నెలా రూ.1వెయ్యి అందించి వారిని ఆదుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టనున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకు పొడగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ అంశాలు కూడా…

ప్రజా ప్రయోజనాలు,సామాజిక అంశాలతో పాటు యూపీలో రాజకీయ పరిస్థితులపై కూడా మోదీ-యోగి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లీకులు బయటకు రాలేదు. ఇద్దరి మధ్య భేటీ కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చునన్న ఊహాగానాలు వినిపించాయి. యూపీలో బీజేపీ పట్టు కోల్పోతున్న నేపథ్యంలో… రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటోందన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని యూపీ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామాకు సిద్దమవుతున్నారన్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు.

ఆ సంకేతాలు పంపించేందుకేనా…?

యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడటంతో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై పార్టీ అధిష్ఠానంలో నమ్మకం సడలిందన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనూ బీజేపీ దెబ్బతినడంతో పార్టీకి ఒకింత భయం పట్టుకుంది.పైగా కోవిడ్ నిర్వహణలో యూపీ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందన్న విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే కోవిడ్ విషయంలో బాహాటంగా విమర్శలు గుప్పించారు. ఇదే తరుణంలో ఆర్ఎస్ఎస్ వరుస సమావేశాలు,పార్టీలోకి కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద చేరిక.. అరవింద్ శర్మను కేబినెట్‌లోకి తీసుకోవాలని మోదీ సూచించడం,అందుకు యోగి తిరస్కరించారని కథనాలు రావడం… ఇవన్నీ యూపీలో అసలేం జరుగుతోందన్న ఆసక్తిని రేకెత్తించాయి. యోగిని తప్పించేందుకే బీజేపీలో ఈ హడావుడి మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఆర్ఎస్ఎస్ సర్ కార్యవహ్‌ దత్తాత్రేయ హొసబ్లే ఆదిత్యనాథ్‌కి అండగా నిలబడటంతో బీజేపీ అధిష్ఠానం మనసు మార్చుకుందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. మోదీ-యోగి మధ్య సఖ్యత చెడలేదన్న సంకేతాలు పంపించేందుకే ఇద్దరి మధ్య తాజా భేటీ జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *