Andhra Pradesh
oi-Srinivas Mittapalli
దివంగత ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు,సివేరి సోమ హత్య కేసులకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఇద్దరి హత్యలో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సాకే కళావతి అలియాస్ భవానీ (45) కీలకంగా వ్యవహరించినట్లు చార్జిషీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో శుక్రవారం(జూన్ 11) అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.
జంట హత్యలకు రెండు వారాల ముందు కళావతితో పాటు ఆమె భర్త,మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న డుంబ్రిగూడలోనే కొన్ని రోజుల పాటు మకాం వేసి హత్యలకు ప్లాన్ చేసినట్లు పేర్కొంది. హత్యలకు పాల్పడిన మావోయిస్టు బృందానికి వీరి నుంచే సరంజామా అందిందని చెప్పుకొచ్చింది. భవానీపై సెక్షన్ 302, చట్టవిరుద్ద కార్యకలాపాల చట్టంలోని సెక్షన్ 18, 20, 38, 39,ఆయుధాల చట్టంలోని 25(1ఏ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. రెండు దశాబ్దాలుగా కళావతి మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నారని తెలిపింది. ఈ జంట హత్యలకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ 9 మంది చార్జిషీట్ దాఖలు చేసింది.

సెప్టెంబర్,2018న అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై మావోయిస్టులు కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలోని డుంబ్రిగూడ మండలం లివిటిపుట్ గ్రామానికి వెళ్తుండగా మావోయిస్టులు వీరి వాహనాలను అడ్డగించి కాల్పులు జరిపారు. సుమారు 20 మంది మావోయిస్టులు ఈ హత్యలో పాలు పంచుకున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరుపున అరకు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.2016 ఏప్రిల్ 28న టీడీపీలో చేరారు. సర్వేశ్వరరావు హత్యతో అప్పట్లో ఆయన పెద్ద కుమారుడు శ్రవణ్ కుమార్‌కు అప్పటి టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. చిన్న కుమారుడు సందీప్‌కు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చింది. ఇక సివేరి సోము 2009లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావుపై ఓటమి చెందారు.
English summary
National Investigation Agency (NIA) has filed a supplementary chargesheet against Sake Kalavathi alias Bhavani, an area committee member (ACM) of the banned CPI (Maoist), on Friday
Story first published: Saturday, June 12, 2021, 8:29 [IST]