
అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హస్తిన పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం.. ఆయన కలవదలచుకున్న కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ దొరక్కపోవడమే. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో వైఎస్ జగన్ భేటీ కావాలనుకున్నారు. ఈ ముగ్గురిలో నిర్మల సీతారామన్ తప్ప మిగిలిన ఇద్దరు మంత్రుల అపాయింట్‌మెంట్ లభించలేదాయనకు. దీనితో తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. తాను కలవదలిచిన కేంద్ర మంత్రులందరి నుంచి అపాయింట్‌మెంట్ లభించినప్పుడే ఢిల్లీకి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.

అమిత్ షాతో సువేందు..
ఇదిలావుండగా తాజాగా- భారతీయ జనతా పార్టీకి చెందిన శాసన సభ్యుడు, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ ఉదయం దేశ రాజధానిలో అమిత్ షా భేటీ అయ్యారు. ఇది ఫక్తు రాజకీయాలకు సంబంధించిన భేటీ. పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తరువాత సువేందు అధికారి.. తొలిసారిగా అమిత్ షాను కలుసుకున్నారు. దీని తరువాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలవాల్సి ఉంది.

రాజకీయ ప్రయోజనాలే
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించిన ఘనత సువేందు అధికారికి ఉంది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సువేందు.. సుమారు 1600 ఓట్ల స్వల్ప మెజారిటీతో మమతా బెనర్జీపై విజయాన్ని సాధించారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన అమిత్ షా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కాలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమదైన శైలిలో జగన్‌ను విమర్శిస్తోన్నారు.

ప్రధానితో ఉద్ధవ్ భేటీ..
అదే సమయంలో- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. మరాఠాలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ఉద్దేశించి.. మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిన నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే.. ప్రధానిని కలిశారు. 50 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వపరంగా చర్యలను తీసుకోవాలని కోరారు. ఒకవంక ఉద్ధవ్.. మరోవంక సువేందు అధికారితో నరేంద్ర మోడీ, అమిత్ షా ఏకకాలంలో సమావేశం కావడం, అదే సమయంలో జగన్‌కు అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం విమర్శలకు దారి తీస్తోంది.