వైద్య సహాయం తప్పదు అనుకుంటే  అక్కడ  ఉన్న అవకాశమంతా - రిజర్వాయర్ లో  నడుస్తున్న పడవ ద్వారా రెండు గంటల ప్రయాణం మాత్రమే. ఇక వేరే ప్రత్యామ్నాయం అంటే అక్కడ ఎత్తైన కొండపైకి పాక్షికంగా నిర్మించిన రహదారి గుండా వెళ్ళాలి.

ఇటువంటి పరిస్థితుల మధ్య తొమ్మిది నెలల గర్భవతి అయిన ప్రాబా గోలోరి ప్రసవానికి చాలా దగ్గరగా ఉంది.

నేను కోటగుడ అనే కుగ్రామానికి  వెళ్లేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. ప్రాబా ఇంటి చుట్టుపక్కల వారు ఆమె గుడిసె చుట్టూ చేరి  లోపల శిశువు మరణిస్తుందేమో అని  ఊహిస్తున్నారు.

35 ఏళ్ల ప్రాబా తన మొదటి బిడ్డను మూడు నెలల వయసులో కోల్పోయింది, ఆమె ఇంకో కుమార్తెకు ఇప్పుడు ఆరు సంవత్సరాలు. స్థానిక దాయి తోనూ, మంత్రసానుల సహాయంతోనూ పెద్దగా  ఇబ్బంది పడకుండానే ఆమె ఆ ఇద్దరినీ ఇంట్లో ప్రసవించింది. కానీ ఈసారి దాయీలు సంశయించారు, ఇది కష్టమైన ప్రసవమని వారు అంచనా వేశారు.

నేను ఆ మధ్యాహ్నం సమీప గ్రామంలో ఉన్నాను. ఫోన్ మోగే సమయానికి వేరే వార్తా కథనాన్ని గురించి వాకబు చేస్తున్నాను. ఫోన్ రాగానే స్నేహితుడి మోటర్‌బైక్ తీసుకొని (నా సాధారణ స్కూటీ ఈ కొండ రహదారులలో నడవదు), నేను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో కేవలం 60 మంది వ్యక్తుల నివసించే  కుగ్రామమైన కోటగుడకు వెళ్లాను.

ఆ ఊరు ఎక్కడో విసిరేసి ఉన్నట్టు దూరంగా ఉంది. చిత్రకొండ బ్లాక్‌లోని ఈ కుగ్రామం, మధ్య భారతదేశంలోని ఆదివాసీ బెల్ట్‌లోని ఇతర ప్రాంతాల మాదిరిగా, నక్సలైట్ ఉగ్రవాదులు మరియు రాష్ట్ర భద్రతా దళాల మధ్య జరిగే పునరావృత ఘర్షణలను చూసింది. ఇక్కడ రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి.

PHOTO • Jayanti Buruda
PHOTO • Jayanti Buruda

చాలా కష్టతరమైన ప్రసవంతో ఇబ్బంది పడుతున్న ప్రాబా గోలోరి (ఎడమ) కు సహాయం చేయడానికి, సమీపం లో ఉన్న ఒకే ఒక్క ఆరోగ్య సేవ, చిత్రకొండకు  40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప-డివిజనల్ ఆసుపత్రిలో ఉంది - అక్కడికి చేరుకోవడానికి ఉన్న మార్గం పడవల పై నీటి ప్రయాణం మాత్రమే. కానీ రిజర్వాయర్ మీదుగా సాగే ఈ పడవలు సాయంత్రం తర్వాత ఆగిపోతాయి.

పరోజా తెగకు చెందిన కోటగుడలో నివసించే కొద్ది కుటుంబాలు ప్రధానంగా పసుపు, అల్లం, పప్పుధాన్యాలు గాక, కొంత వరిని తమ సొంత ఆహారం కోసం పండిస్తాయి, అలాగే సందర్శించే కొనుగోలుదారులకు విక్రయించడానికి మరికొన్ని పంటలను పండిస్తాయి.

జోడంబో పంచాయతీలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, వైద్యుల సందర్శనలు సక్రమంగా లేవు. లాక్డౌన్తో, ఆగష్టు 2020 లో ప్రాబా బిడ్డ ప్రసవ సమయానికి  పిహెచ్‌సి మూసివేయబడింది. కుడుములుగుమా గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సమయంలో, ప్రాబాకు శస్త్రచికిత్స అవసరం, ఇది CHC నిర్వహించలేనిది.

కాబట్టి చిత్రకొండలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్ డివిజనల్ హాస్పిటల్ కు వెళ్లడం ఒక్కటే మార్గం  - కాని చిత్రకొండ / బలిమెలా రిజర్వాయర్ మీదుగా సాగే పడవలు సాయంత్రం తర్వాత ఆగిపోతాయి. ఎత్తైన కొండల మీదుగా వెళ్లే దారికి మోటారుబైక్ లేదా కఠినమైన నడక అవసరం - తొమ్మిది నెలల గర్భవతి అయిన ప్రాబాకు ఈ రెండు పనిచేయవు.

మల్కన్‌గిరి జిల్లా ప్రధాన కార్యాలయంలో నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా సహాయం పొందడానికి ప్రయత్నించాను, కాని సరిగ్గా లేని రోడ్ల మీదుగా అంబులెన్స్ పంపడం కష్టమని వారు చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో వాటర్ అంబులెన్స్ సేవ ఉంది, కానీ అది కూడా లాక్డౌన్ కారణంగా రాలేకపోయింది.

అప్పుడు నేను స్థానిక ASHA (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త)ను ఒక ప్రైవేట్ పిక్-అప్ వ్యాన్‌తో రావడానికి ఒప్పించాను. ఆ ధర సుమారు రూ. 1,200. కానీ ఆమె మరుసటి రోజు ఉదయం మాత్రమే రాగలదు.

PHOTO • Jayanti Buruda

అరుదుగా సాగే రాష్ట్ర మోటారు ప్రయోగ సేవ కూడా ఉన్నట్టుండి సేవలను నిలిపివేసింది. ప్రైవేటుగా నడిచే పడవ కూడా సాయంత్రానికి సేవలు ఆపివేస్తుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో, రవాణా చాలా పెద్ద సమస్యగా మిగిలిపోయింది

మేము వెంటనే బయలుదేరాము.  ప్రాబాను తీసుకెళ్తున్న వ్యాన్ కొండ ఎత్తు పైకి ఎక్కి నిర్మాణంలో ఉన్న రోడ్డు మీద ఉన్నట్టుండి నిలిచిపోయింది. పొయ్యి కట్టెల కోసం వచ్చిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని సహాయం చేయమని వారిని అభ్యర్థించాము. వారు మమ్మల్ని ఒక బిఎస్ఎఫ్ క్యాంప్ ఉన్న కొండపైకి తీసుకువెళ్లారు. హంటల్‌గుడలోని ఆ శిబిరంలోని సిబ్బంది ప్రాబాను చిత్రకొండలోని సబ్-డివిజనల్ ఆసుపత్రికి పంపడానికి ఏర్పాట్లు చేశారు.

ఆసుపత్రిలో, ఆమెను 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కన్‌గిరి జిల్లా ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లాల్సి ఉంటుందని సిబ్బంది తెలిపారు. వారు అక్కడకు తీసుకువెళ్లే వాహనాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేశారు.

అంటే నేను మొదట కోటగుడకు చేరిన ఒకటిన్నర రోజు తరవాత మేము జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాము.

అక్కడ, వైద్యులు మరియు వైద్య సిబ్బంది ప్రసవాన్ని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు ప్రాబా మూడు రోజుల వేదనను భరించింది. చివరగా, ఆమెకు సిజేరియన్ చేయించుకోవలసి ఉంటుందని మాకు చెప్పారు.

ఇక ఆగస్టు 15, ఆ మధ్యాహ్నం ప్రాబా కు మగపిల్లవాడు పుట్టాడు - అతను చాలా మూడు కిలోల బరువును కలిగి, ఆరోగ్యంగా కనిపించాడు. కానీ అతని పరిస్థితి బాలేదని వైద్యులు చెప్పారు.  శిశువుకు మల వ్యర్థాలను పంపించడానికి ఓపెనింగ్ లేదు కాబట్టి తక్షణ శస్త్రచికిత్స అవసరం. మల్కన్‌గిరి జిల్లా ప్రధాన కార్యాలయం ఆసుపత్రిలో  ఈ విధానాన్ని నిర్వహించడానికి సరైన సౌకర్యాలు  లేవు.

శిశువును 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరాపుట్ లోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలో, అంటే ఇప్పుడున్న ఆసుపత్రి కన్నా పెద్ద సదుపాయాలు ఉన్న చోట చేర్చవలసి ఉంటుంది.

PHOTO • Jayanti Buruda
PHOTO • Jayanti Buruda

దాదాపు తొమ్మిది నెలల గర్భవతి అయిన కుసామా నరియా (ఎడమ) ఆమె ఆధార్ కార్డులో దిద్దుబాట్లు చేయించుకోవడానికి చిత్రకొండకు బయలుదేరింది. ఆమె పడవ (కుడి, ఎరుపు చీరలో)బల్ల మీద నడుస్తుంది .

శిశువు తండ్రి, పోడు గోలోరి ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నాడు. తల్లి ఇంకా అపస్మారక స్థితిలో ఉంది. కాబట్టి ASHA వర్కర్ (మొదట కోటగుడ కుగ్రామానికి వ్యాన్‌తో వచ్చిన వ్యక్తి) ఇంకా నేను శిశువును కొరాపుట్ వద్దకు తీసుకువెళ్ళాము. ఇది ఆగస్టు 15 సాయంత్రం 6 గంటలకు జరిగింది.

మేము ప్రయాణిస్తున్న హాస్పిటల్ అంబులెన్స్ కేవలం మూడు కిలోమీటర్ల తర్వాత ఆగిపోయింది. మేము రెండవ వ్యాన్ ని ఎలాగోలాగ పిలగాలిగినా అది కూడా మరో 30 కిలోమీటర్ల తర్వాత ఆగిపోయింది. మరో అంబులెన్స్ కోసం మేము అడవిలో భారీ వర్షంలో తడుస్తూ ఎదురుచూశాము. మేము చివరికి ఆ లొక్డౌన్ లో, అర్ధరాత్రి దాటాక కోరాపుట్ చేరాము.

అక్కడ వైద్యులు శిశువును ఏడు రోజులు పాటు ఐసియులో ఉంచారు. ఇంతలో, మేము ప్రాబాను (పోడుతో పాటు) కొరాపుట్ కు బస్సులో తీసుకురాగలిగాము. ఆమె తన బిడ్డను ఒక వారం తరవాత చూడగలిగింది. కానీ వైద్యులు వారి వద్ద పిల్లల శస్త్రచికిత్సకు అవసరమైన సౌకర్యాలు గాని నైపుణ్యం గాని లేవని చెప్పారు.

శిశువును మరో ఆసుపత్రికి తీసుకెళ్లవలసి ఉంటుంది. అది 700 కిలోమీటర్ల దూరంలో ఉంది - బెర్హాంపూర్‌లోని ఎంకెసిజి మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ (బ్రహ్మపూర్ అని కూడా పిలుస్తారు). మేము మరోసారి మరొక అంబులెన్స్ కోసం ఎదురుచూశాము. మరో సుదీర్ఘ ప్రయాణం కోసం మమ్మల్ని సిద్ధపరచుకున్నాము.

అంబులెన్స్ ఒక స్టేట్ ఫెసిలిటీ నుండి వచ్చింది, కానీ ఈ ప్రాంతం లో వేరే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, మేము సుమారు రూ. 500 ఖర్చు పెట్టవలసి వచ్చింది. (నా స్నేహితులు మరియు నేను ఈ ఖర్చులను చూసుకున్నాము - ఆస్పత్రులకు వెళ్ళే అనేక ప్రయాణాలలో మేము మొత్తం రూ .3,000-4,000 ఖర్చు చేశాము). బెర్హంపూర్‌లోని ఆసుపత్రికి చేరుకోవడానికి మాకు 12 గంటలకు పైగా సమయం పట్టిందని నాకు గుర్తు.

PHOTO • Jayanti Buruda

టెంటపాలి ప్రజలు రెండు గంటల నీటి ప్రయాణం తరువాత చిత్రకొండ నుండి తిరిగి వస్తున్నారు; ఈ జీప్ ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న వారి కుగ్రామానికి తీసుకువెళుతుంది. ఇది ఇటీవల మొదలైన భాగస్వామ్య సేవ; గతంలో, వారు ఈ దూరం అంతా నడిచేవారు.

అప్పటికే, చిత్రకొండ, మల్కంగిరి ప్రధాన కార్యాలయం, కొరాపుట్ మరియు బెర్హంపూర్ వీటన్నిటికీ - వాన్, ట్రాక్టర్, చాలా అంబులెన్సులు, బస్సుల ద్వారా మేము నాలుగు వేర్వేరు ఆసుపత్రులకు వెళ్ళాము. దాదాపు 1,000 కిలోమీటర్లు ప్రయాణించాము.

శిశువు పైన జరగబోయే శస్త్రచికిత్స చాలా క్లిష్టమైనది, అని మాకు చెప్పారు. శిశువు యొక్క  ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. అంతేగాక కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి వచ్చింది. మల వ్యర్థాలను తొలగించడానికి కడుపులో ఓపెనింగ్ చేశారు. రెగ్యులర్ ఓపెనింగ్ సృష్టించడానికి రెండవ ఆపరేషన్ అవసరం, కానీ శిశువు ఎనిమిది కిలోల బరువుకు  చేరినప్పుడే మాత్రమే ఇది చేయవచ్చు.

నేను చివరిసారిగా కుటుంబంతో మాట్లాడినప్పుడు, ఎనిమిది నెలల వయసున్న ఆ శిశువు ఇంకా అంత బరువును సాధించలేదు. రెండవ శస్త్రచికిత్స ఇంకా జరగలేదు.

ఇంత ఇబ్బంది ఎదురైనా,  శిశువు పుట్టిన ఒక నెల తరువాత, అతని నామకరణ వేడుకకు నన్ను పిలిచారు. నేను అతనికి మృత్యుంజయ్(మరణాన్ని జయించినవాడు) అని పేరు పెట్టాను -. అది ఆగష్టు 15, 2020 న, భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం - అతను అర్ధరాత్రి తన విధితో పోరాడుతూ ఉన్నాడు. తల్లిలాగే అతనూ విజయం సాధించాడు.

*****

ప్రాబా యొక్క పరిస్థితి మామూలు ఇబ్బందులు కంటే చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రజా ఆరోగ్య సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న మల్కాంగిరి జిల్లాలోని చాలా మారుమూల ఆదివాసీ కుగ్రామాలలో, ఇలాంటి పరిస్థితులలో ఉండే మహిళలు అందరూ చాలా ప్రమాదంలో ఉన్నట్టే.

షెడ్యూల్డ్ తెగలు - ప్రధానంగా పరోజా, కోయా తెగలు - మల్కాంగిరి లోని 1,055 గ్రామాల మొత్తం జనాభాలో 57 శాతం ఉన్నారు. ఈ సమాజాల ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులను ప్రభుత్వం చాలా బాగా ప్రదర్శించుకున్నా, ఇక్కడి ప్రజల ఆరోగ్య అవసరాలు చాలా వరకు విస్మరించబడతాయి. స్థలాకృతి - కొండలు, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు - సుదీర్ఘ సంవత్సరాల సంఘర్షణతో పాటు రాష్ట్ర నిర్లక్ష్యం కూడా ఇక్కడి పరిస్థితి కి కారణమయింది. ఈ కుగ్రామాలలోనే కాదు గ్రామాలలో కూడా ప్రాణాలను రక్షించే ఆరోగ్యసేవలకు ఇక్కడ ఏ విధమైన సౌకర్యాన్ని ఏర్పాటుచేయలేదు.

PHOTO • Jayanti Buruda

‘స్త్రీలు కూడా హృదయాన్ని కలిగి ఉన్నారని, మాకు కూడా నొప్పి కలుగుతుందని మగవాళ్ళు గ్రహించరు. పిల్లలను కనడానికే మేము పుట్టామని వారు భావిస్తారు '

మల్కన్‌గిరి జిల్లాలో కనీసం 150 గ్రామాలకు రోడ్ రవాణా సౌకర్యం లేదు (ఒడిశా అంతటా రోడ్డు సంబంధాలు లేని జనాభా మొత్తం 1,242 గ్రామాలు అని పంచాయతీ రాజ్, తాగునీటి మంత్రి ప్రతాప్ జేనా 2020 ఫిబ్రవరి 18 న రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు).

వీటిలో కొటగుడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంటపాలి ఉంది, ఇది కూడా రహదారి ద్వారా ప్రయాణించి చేరలేని కుగ్రామం. "బాబు, మా జీవితం చుట్టుపక్కల నీటితో నిండి ఉంది, కాబట్టి మేము జీవిస్తున్నామా లేక చనిపోతున్నామా అని ఎవరు పట్టించుకుంటారు ?" అని 70 సంవత్సరాల పైనే టెంటపాలిలో నివసించిన కమలా ఖిల్లో అన్నారు. "మేము మా జీవితంలో ఎక్కువ భాగం ఈ నీటిని మాత్రమే చూశాము, దీని వలన మా మహిళలకు,  యువతులకు కష్టాలు పెరుగుతున్నాయి."

జలాశయ ప్రాంతంలోని టెంటపాలి, కోటగుడ, మరో మూడు కుగ్రామాల ప్రజలు, ఇతర గ్రామాలకు చేరుకోవడానికి మోటారు పడవ ద్వారా ప్రయాణిస్తారు.  ఈ ప్రయాణాలకు 90 నిమిషాల నుండి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకొండ వద్ద ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందడానికి, పడవ అత్యంత అవసరం అయిపోయింది. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహెచ్‌సికి చేరుకోవడానికి, ఇక్కడ నివసించే ప్రజలు పడవ తీసుకొని అవతలకు చేరుకొని ,అక్కడ  బస్సు లేదా షేర్డ్ జీపుల ద్వారా ప్రయాణించాలి.

జల వనరుల శాఖ అందించే మోటారు ప్రయోగ సేవను నమ్ముకోలేము. దీనికి ఒక షెడ్యూల్ ఉండదు, సేవలను కూడా తరచుగా నిలిపివేస్తుంటారు. ఈ పడవలు సాధారణంగా ఒక రోజులో ఒకసారి ముందుకు తరవాత వెనక్కి వచ్చే ప్రయాణాన్ని మాత్రమే చేస్తాయి. ప్రైవేటుగా నడిచే పవర్ బోట్ సేవకు, ఒక టికెట్‌ ఖరీదు  20 రూపాయలు, ఇది రాష్ట్ర ప్రయోగ సేవ కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు. ఇది కూడా సాయంత్రం వరకే నడుస్తుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో, రవాణా చాలా పెద్ద సమస్యగా మిగిలిపోయింది.

"ఆధార్ కోసం లేదా వైద్యుడిని సంప్రదించడం కోసం, మేము ఈ [రవాణా పద్ధతులపై] ఆధారపడవలసి ఉంది. అందువలన చాలా మంది మహిళలు తమ ప్రసవాల కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి ఇష్టపడరు", అని కోటగుడలో 20 ఏళ్ల వయసులో ముగ్గురు పిల్లల తల్లి అయిన కుసుమా నరియా చెప్పారు.

PHOTO • Jayanti Buruda
PHOTO • Jayanti Buruda

టెంటపాలి కుగ్రామానికి చెందిన సమరి ఖిల్లో ఇలా అంటాడు: 'మేము వైద్య [సేవల] కన్నా దాయీ మా పై  ఎక్కువ ఆధారపడతాము. ఆమెనే మాకు డాక్టర్, దేవుడు.’

ఇప్పుడు, ASHA వర్కర్లు ఈ మారుమూల కుగ్రామాలను సందర్శిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ASHA దీదీలు పెద్దగా అనుభవం కానీ, విషయం పరిజ్ఞానం కానీ లేనివారు. వారు గర్భిణీ స్త్రీలకు ఇనుప మాత్రలు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు మరియు పొడి ఆహార పదార్ధాలను ఇవ్వడానికి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వస్తారు. పిల్లల రోగనిరోధకత యొక్క రికార్డులు చెల్లాచెదురుగా, అసంపూర్ణంగా ఉన్నాయి. కొన్నికష్టమైన ప్రసవ సమయాల్లో వారు గర్భిణీ తో పాటు ఆసుపత్రికి వెళతారు.

ఇక్కడి గ్రామాలలో, రెగ్యులర్ సమావేశాలు మరియు అవగాహన శిబిరాలు లేవు. మహిళలు, కౌమారదశలో ఉన్న బాలికలతో వారి ఆరోగ్య సమస్యల గురించి చర్చలు లేవు. ఆశా వర్కర్లు పాఠశాల భవనాలలో నిర్వహించాల్సిన సమావేశాలు కూడా చాలా అరుదుగా జరుగుతాయి. ఎందుకంటే కోటగుడలో పాఠశాల లేదు (టెంటపాలిలో ఒకటి ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు ఎప్పుడూ సరిగ్గా రాలేదు) అంతేగాక అంగన్‌వాడీ భవనం నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసి ఉంది.

జోడంబో పంచాయతీలోని పిహెచ్‌సి చిన్న రోగాలకు మాత్రమే ప్రాథమిక చికిత్సను అందించగలదని, గర్భిణీ స్త్రీలకు లేదా సంక్లిష్ట కేసులకు సౌకర్యాలు లేనందున, ఆమె ఇంకా ఇతర దీదీలు చిత్రకొండ సిహెచ్‌సిని ఇష్టపడతారని ఈ ప్రాంతంలోని ఆశా వర్కర్ జమునా ఖారా చెప్పారు. "కానీ ఇది చాలా దూరం. రోడ్డు ద్వారా సరైన ప్రయాణం సాధ్యం కాదు. పడవ కూడా ప్రమాదకరమే. ప్రభుత్వ ప్రయోగం అన్ని వేళలా పనిచేయదు. కాబట్టి సంవత్సరాలుగా మేము దాయీ మా [సాంప్రదాయ జనన పరిచారకులు, టిబిఎలు] పై ఆధారపడ్డాము. ”

పరోజా ఆదివాసీ అయిన టెంటపాలి కుగ్రామానికి చెందిన సమరి ఖిల్లో దీనిని ధృవీకరిస్తున్నారు: “మేము వైద్య [సేవల] కన్నా దాయి మా పైనే ఎక్కువ ఆధారపడతాము. నా ముగ్గురు పిల్లలు దాయీల సహాయంతో మాత్రమే ప్రసవించారు - మా గ్రామంలో ముగ్గురు దాయీలు ఉన్నారు. ”

ఇక్కడ సుమారు 15 ప్రక్కనే ఉన్న కుగ్రామాల నుండి మహిళలు బోధాకి డోకారి పై ఆధారపడతారు - టిబిఎలను స్థానిక దేశీయ భాషలో సూచిస్తారు. "వైద్య కేంద్రాలను సందర్శించకుండా మేము సురక్షితంగా తల్లులుగా మారగలము కాబట్టి వారు మాకు ఒక వరం" అని సమరి జతచేస్తుంది. “వారే మాకు డాక్టర్, దేవుడు. స్త్రీలుగా, వారు కూడా మా వేదనను అర్థం చేసుకుంటారు - మాకు కూడా హృదయం ఉందని పురుషులు గ్రహించరు. మాకు కూడా నొప్పి వస్తుంది. కానీ శిశువులను ప్రసవించడానికే మేము పుట్టామని వారు భావిస్తారు."

PHOTO • Jayanti Buruda

గోరమ నాయక్, కమలా ఖిల్లో, దరామ పంగి (కుడి నుండి ఎడమ), వీరందరూ అనుభవజ్ఞులైన  దాయీ మా లు  (సాంప్రదాయ జనన పరిచారకులు); ఇక్కడ సుమారు 15 కుగ్రామాల ప్రజలు వారిపై ఆధారపడతారు

ఇక్కడ ఉన్న దాయిలు గర్భం ధరించలేని మహిళలకు స్థానిక ఔషధ మూలికలను కూడా ఇస్తారు. ఒకవేళ ఇవి పని చేయకపోతే, వారి భర్తలు కొన్నిసార్లు తిరిగి వివాహం చేసుకుంటారు.

13 ఏళ్ళ వయసులో వివాహం చేసుకుని, 20 ఏళ్లు వచ్చేసరికి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కుసుమా నరియా, గర్భ నిరోధకత మాత్రమే కాదు, ఋతుస్రావం గురించి కూడా తనకు తెలియదని చెప్పింది. "అప్పటికి  నేను చిన్నపిల్లను, ఏమీ తెలియదు" అన్నది. “కానీ ఋతుక్రమం మొదలైనప్పుడు, నా తల్లి ఒక బట్టను ఇచ్చి దానిని ఉపయోగించమని చెప్పింది.  నేను ఎదిగిన అమ్మాయిని అయ్యానని నాతొ చెప్పి, ఆ తరవాత వెంటనే నాకు పెళ్లి చేసింది.  శారీరక సంబంధాల గురించి కూడా నాకు ఏమీ తెలియదు. నా మొదటి డెలివరీ సమయంలో, అతను నన్ను ఒంటరిగా ఆసుపత్రిలో వదిలిపెట్టాడు, కనీసం  పాప బతికిందో లేదు కనుక్కోలేదు - ఎందుకంటే పుట్టింది ఆడపిల్ల కాబట్టి. కానీ నా కూతురు బతికింది.” అన్నది.

కుసుమా యొక్క మరో ఇద్దరు పిల్లలు అబ్బాయిలే. "నేను కొంత విరామం తర్వాత రెండవ బిడ్డను కనడానికి నిరాకరించినప్పుడు, అందరూ అబ్బాయిని ఆశిస్తున్నందున నన్ను కొట్టారు. నాకు, నా భర్తకు దవై [గర్భనిరోధక మందులు] గురించి తెలియదు. నాకు తెలిసి ఉంటే, ఇంత  బాధపడేదాన్ని కాదు. ఒకవేళ నేను వ్యతిరేకించినట్లయితే, నన్ను ఇంటి నుండి తరిమివేసేవారు.”

కోటగుడలోని కుసుమా ఇంటికి దగ్గరలోనే ప్రాబా ఇల్లు ఉంది. మొన్న ఒక రోజు ఆమె నాతో ఇలా చెప్పింది: “నేను బతికే ఉన్నానని నమ్మలేకపోతున్నాను. అప్పుడు జరిగినదంతా నేను ఎలా భరించానో నాకు తెలియదు. అప్పుడు నేను భయంకరమైన బాధలో ఉన్నాను, నా సోదరుడు ఏడుస్తున్నాడు, నన్ను అలా చూడలేకపోయాడు. అప్పుడు ఆసుపత్రి నుండి ఆసుపత్రికి ప్రయాణం, పైగా నా బిడ్డ ని కూడా కొన్ని రోజులు చూడలేకపోయాను. నేను వీటన్నిటి నుంచి ఎలా బయటపడ్డానో నాకు తెలియదు. అలాంటి అనుభవాలు ఎవరికీ ఉండకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ మేమంతా ఘాటి [పర్వత] అమ్మాయిలం, మా అందరి జీవితం ఒకలాంటిదే.

మృతుంజయ్‌కు జన్మనిచ్చిన ప్రాబా యొక్క అనుభవం - ఇక్కడి గ్రామాల్లో చాలా మంది మహిళల కథలు, అలానే  భారతదేశంలోని గిరిజన ప్రాంతాలలో మహిళలు ఎలా జన్మనిస్తారు అనే కథలు నమ్మలేనంత ఘోరంగా ఉంటాయి. కానీ మన మల్కన్‌గిరిలో ఏమి జరుగుతుందో ఎవరైనా పట్టించుకుంటారా?

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని మళ్ళీ ఎక్కడైనా ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి మెయిల్ చేసి [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: అపర్ణ తోట

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Jayanti Buruda

Jayanti Buruda of Serpalli village in Malkangiri, Odisha, is a full-time district reporter for Kalinga TV. She focuses on stories from rural areas, and on livelihoods, culture and health education.

Other stories by Jayanti Buruda
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi