
బాబు మాయలో పడి..
రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ లోక్‌సభ సభ్యుడే అయినప్పటికీ.. ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతల ప్రభావం తీవ్రంగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రఘురామను తమపై ప్రయోగించే అస్త్రంగా మార్చుకున్నారని వ్యాఖ్యానిస్తోన్నారు. దీనికితోడు- రఘురామ అనుసరిస్తోన్న వైఖరి కూడా పార్టీకి వ్యతిరేకంగానే ఉంటోందనేది వైసీపీ నేతల అభిప్రాయం. అవన్నీ వెరసి- వైసీపీకి వ్యతిరేకంగా ఆయనను పురిగొల్పడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తోన్నారని అంటున్నారు.

పశ్చాత్తాప పడినా..
చంద్రబాబు మాయలో పడిన రఘురామ.. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్నప్పటికీ.. ఉపయోగం ఉండబోదని స్పష్టం చేస్తోన్నారు. ఆయన వాస్తవ పరిస్థితులను గ్రహించుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో శరీరంపై వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా పరిస్థితి అర్థమవుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని, ఆ తరువాత పశ్చాతాప పడతారని పేర్కొన్నారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుందని ఆయన తేల్చి చెప్పారు.

జగన్‌ది ముందుచూపు.. చంద్రబాబుది దొంగచూపు
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యయంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో వ్యవహరిస్తుంటారని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు పరిస్థితి మాత్రం ఎప్పుడూ దీనికి భిన్నంగా ఉంటుందని విమర్శించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుది ఎప్పుడూ దొంగ చూపేనని ఎద్దేవా చేశారు. లిటిగేషన్లతో ప్రభుత్వాన్ని దొంగదెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారని ధ్వజమెత్తారు. లిటిగెన్సీని నమ్ముకున్న నాయకుడెవరూ బాగుపడిన దాఖలు చరిత్రలో లేవని సాయిరెడ్డి స్పష్టం చేశారు.

అందుకే ముందస్తు వర్షాలు..
చంద్రబాబు, తన కుమారుడు నారా లోకేష్‌తో సహా పక్క రాష్ట్రంలో ఉంటోన్నారని.. అందుకే ఏపీలో ముందే వర్షాలు పడుతున్నాయని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు-నారా లోకేష్ ఇద్దరూ కరవుకు మారుపేర్లలాంటి వారని చురకలు అంటించారు. మరో నాలుగు నెలల పాటు వారిద్దరూ ఏపీకి రాకపోతేనే మేలని, రుతుపవనాలు భారీ వర్షాలను కురిపిస్తాయని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా భయంతో వారిద్దరూ సొంత రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎలాంటి షరతులు లేకుండా ఇంకో పార్టీకి మద్దతిస్తానని ప్రాధేయపడటం ఎక్కడా ఉండదని, బీజేపీకి మద్దతుగా టీడీపీ చేసిన తీర్మానాన్ని సాయిరెడ్డి గుర్తు చేశారు.