
రీవ్యాక్సినేషన్ తప్పదు..
అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోని వర్సిటీల్లో ఆగస్టులో ప్రవేశాలు మొదలవుతున్న నేపథ్యంలో టీకాలు, వీసాల అనుమతిపై గందరగోళం కొనసాగుతున్నది. టీకాలకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీలు కీలక ప్రకటనలు చేశాయి. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులందరూ అమెరికాలో ఆమోదం పొందిన లేదా డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని అవి పేర్కొన్నాయి. భారతీయ విద్యార్థులు స్వదేశంలో టీకాలు తీసుకున్నట్లయితే, అమెరికా చేరిన తర్వాత మరోసారి టీకా (రీవ్యాక్సినేషన్) తప్పనిసరి అని ఆదేశించాయి. దీంతో ఇప్పటికే భారత్ లో టీకాలు పొంది, అమెరికా పయనం అయ్యేందుకు సిద్ధమైన విద్యార్థుల పరిస్థితి డోలాయమనంలో పడినట్లయింది..

కొవాగ్జిన్, స్ఫుత్నిక్ టీకాలు చెల్లవు..
అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరబోయే భారతీయ విద్యార్థులు స్వదేశంలో కొవాగ్జిన్ లేదా స్ఫుత్నిక్ వి టీకాలను తీసుకున్నట్లయితే అవి తమ గడ్డపై చెల్లుబాటు కావని, కచ్చితంగా డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన టీకాలు వేసుకుంటేనే అనుమతిస్తామని అక్కడి అదికారులు చెబుతున్నారు. కేంద్రం సహకారంతో భారత్ బయోటెక్ రూపొందించిన కొవిషీల్డ్, రష్యా తయారీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు ఇప్పటిదాకా డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించకపోవడాన్ని ప్రస్తావిస్తూ అమెరికన్ వర్సిటీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందని టీకాల సామర్థ్యంపై కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని, కాబట్టే అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలను మళ్లీ తీసుకోవాలని వర్సిటీలు కోరుతున్నాయి.

రెండు డోసులు తీసుకున్నా..
భారతీయ విద్యార్థులకు రీవ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ కీలక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో భారత్ కు చెందిన 25 ఏళ్ల విద్యార్థిని మిలోని దోషి ఆసక్తికర విషయాలు చెప్పారు. మిలోనీకి కొలంబియా యూనివర్సిటీలో సీటు దక్కగా, ఇప్పటికే ఆమె భారత్ లో కొవాగ్జిన్ టీకాలు రెండు డోసులనూ తీసుకున్నారు. కానీ ఆమె అమెరికాలో చదవాలంటే ఇప్పుడు మరో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ‘‘టీకాలు వేయించుకోడానికి నేను భయపడట్లేదు. కానీ రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడం గురించే నా ఆందోళనంతా. ఒక వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా మరో వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతవరకు సేఫ్? అనేది ఎవరూ చెప్పట్లేదు. అదీగాక, అప్లికేషన్ ప్రక్రియ చాలా కష్టతరంగా ఉంది” అని మిలోని చెప్పుకొచ్చారు.

రీవ్యాక్సినేషన్ సేఫ్టీపైనా గందరగోళం
అమెరికా యూనివర్సిటీల రీవ్యాక్సినేషన్ ఉత్తర్వులతో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయేమోనని ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికార ప్రతినిధి క్రిస్టిన్ నోర్డ్లాండ్ స్పందించారు. రెండు వేర్వేరు టీకాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై ఇప్పటి వరకు అధ్యయనాలు జరగలేదని కుండబద్దలుకొట్టారు. ఇప్పటికే ఏదైనా టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీ విద్యార్థులు అమెరికా చేరిన తర్వాత.. డబ్ల్యూహెచ్‌ఓ ధ్రువీకరించిన మరో వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడానికి ముందు 28 రోజులు వేచి ఉండాలని క్రిస్టిన్ సూచించారు.

అమెరికాకూ నష్టమే అయినా..
విదేశీ వ్యార్థులకు రీవ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడం వల్ల అక్కడి వర్సిటీల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. భారతీయ విద్యార్థుల వల్ల అక్కడి వర్సిటీలకు ఏటా 39 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. రీవ్యాక్సినేషన్ ప్రక్రియ సేఫ్టీపై క్లారిటీ లేకపోవడం, ఒకవేళ తీసుకుందామన్నా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అపాయింట్‌మెంట్ దొరికే సూచనలు కనిపించకపోవడం ప్రతికూలంగా మారింది. తమ భవిష్యత్ ప్రణాళికపై రీవ్యాక్సినేషన్ ప్రభావం చూపుతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, సీరం-ఆస్ట్రాజెనెకా వారి కొవిషీల్డ్ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఉండటంతో ఆ టీకాలు తీసుకున్న వారికి దాదాపు ఎలాంటి ఇబ్బందులుండవు. భారత ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న కొవాగ్జిన్, రష్యా ఆరోగ్య శాఖ భాగస్వామిగా ఉన్న స్పుత్రిక్ వి వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించకపోవడంపై రాజకీయ విమర్శలూ వస్తున్నాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా, బ్రిటన్ ల పెత్తనంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి..