
వరలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోరవానిపాలెంకు చెందిన రమేష్(27)తో మారికవలసకు చెందిన పీతల వరలక్ష్మికి 2014లో వివాహం జరిగింది. వీరికి సంధ్యశ్రీ అనే మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే, మరో వ్యక్తితో వరలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందనే కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో వీరిద్దరూ విడిపోయారు.

కూతురు చనిపోయిందంటూ తండ్రికి ఫోన్..
మే 14న వరలక్ష్మి తన మూడేళ్ల చిన్నారితో కలిసి వేరేగా ఉంటోంది. వరలక్ష్మితో సహజీవనం చేస్తున్న జగదీష్ కూడా ఉంటున్నాడు. అయితే, జూన్ 2న వరలక్ష్మి రమేష్‌కు ఫోన్ చేసి పాప సంధ్యశ్రీ చనిపోయిందని చెప్పింది. దీంతో తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురైన రమేష్.. కుటుంసభ్యులతో కలిసి భార్య వరలక్ష్మి దగ్గరకు వెళ్లాడు.

కూతురు మరణంపై తండ్రి ఫిర్యాదు..
అయితే, అప్పటికే చిన్నారి సంధ్యశ్రీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పాప మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రమేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట తమ సహజీవనానికి అడ్డువస్తుందనే నెపంతో తల్లి వరలక్ష్మే చిన్నారిని చంపిందని అంతా భావించారు. అయితే, పోలీసుల విచారణలో అసలు నిజం తెలిసింది.

తల్లి ప్రియుడే హంతకుడు..
వరలక్ష్మి ప్రియుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే చిన్నారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు జగదీష్. తాను గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. జూన్ 1న అర్ధరాత్రి చిన్నారిని చంపేసి అప్పుడే అంత్యక్రియలు చేసినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, చిన్నారి హత్య స్థానికంగా కలకలం రేపింది. చిన్నారి ప్రాణం తీశారంటూ వరలక్ష్మి, జగదీష్‌లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతురు మరణంతో తండ్రి రమేష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.