
జీపు యాత్రతో జనంలోకి…
హుజురాబాద్‌లో తాజాగా సమావేశమైన ‘ఈటల దళిత బాధితుల సంఘం’ మాజీ మంత్రి పెట్టిన అక్రమ కేసులు,అరాచకాల బారినపడిన దళిత కుటుంబాలతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సమావేశంలో ఈటల కారణంగా తాము ఎదుర్కొంటున్న కేసులు,పీడీ యాక్టులపై చర్చించినట్లు,దీనిపై ఐక్యంగా పోరాడాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈటల బాధితుల్లో ఇప్పటివరకూ 17 కుటుంబాలను గుర్తించామని.. భవిష్యత్తులో హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మాజీ మంత్రి బాధితులను గుర్తిస్తామని తెలిపింది.ఈటల బాధితులను గుర్తించేందుకు అన్ని మండలాల్లో ఇన్‌చార్జిలను నియమిస్తామని… త్వరలోనే జీపు యాత్ర చేపట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈటల బాధితుల సంఘం స్పష్టం చేసింది.

ప్రశ్నించినందుకే కేసులు : ఈటల బాధితుల సంఘం
ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పరపు సంపత్ మాట్లాడుతూ… నియోజకవర్గంలో మాజీ మంత్రి అక్రమాలు,అరాచకాల బారినపడిన కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈటలను ప్రశ్నించినందుకే ఆయా కుటుంబాలపై ఆయన కేసులు పెట్టి వేధిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారని చెప్పారు. త్వరలోనే మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమించి మరింతమంది బాధితుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈటల అరాచకాలు,అక్రమాలు,ఆక్రమాస్తులపై ఇంటింటికి తిరిగి తెలియజేస్తామన్నారు.

ఈటలకు పొలిటికల్ డ్యామేజ్…?
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన నాటి నుంచి నిన్నటి ప్రెస్‌మీట్ వరకూ మాజీ మంత్రి ఈటల తాను ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల పక్షపాతినని చెప్పుకునే ప్రయత్నం చేశారు.రైతు బంధు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద రైతులకే దక్కాలని తాను మాట్లాడినట్లు చెప్పారు. సీఎం పేషీలో ఒక్క ఎస్సీ,ఎస్టీ,బీసీ అధికారి కూడా ఎందుకు లేడని ప్రశ్నించారు.తాను ముదిరాజ్ బిడ్డను అని.. ఆత్మగౌరవమే తనకు ప్రధానమని గతంలో వ్యాఖ్యానించారు. ఓవైపు ఈటల ఇలా బహుజన వర్గాల పక్షపాతినని చెప్పుకుంటుంటే.. మరోవైపు ‘ఈటల దళిత బాధితుల సంఘం’ వంటివి పుట్టుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యమైన వేళ ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ టీఆర్ఎస్ క్యాడర్ ఈటల వైపు మళ్లకుండా పార్టీ అధిష్ఠానం పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడిలా బాధిత కుల సంఘాలు ఏర్పాటవడం ఈటలకు నష్టం చేసే అవకాశం లేకపోలేదు.