"పాప తన అమ్మని తీసుకురమ్మని గంటలు గంటలు ఏడుస్తుంది" అని తన ఏడేళ్ల కుమార్తె నవ్య తండ్రి శిశుపాల్ నిషాద్ చెప్పారు. “అయితే నేను ఆమెను ఎక్కడ నుండి తీసుకు వస్తాను? నాకు మతిపోతుంది. మేము వారాల తరబడి నిద్రపోలేదు ”, అన్నాడు ఈ  ఉత్తర ప్రదేశ్‌లోని సింగ్టౌలి గ్రామానికి చెందిన ఈ 38 ఏళ్ల కార్మికుడు.

శిశుపాల్ భార్య మంజు - నవ్య తల్లి - జలాన్ జిల్లాలోని కుతాండ్ బ్లాక్‌లోని సింగ్టౌలి ప్రాథమిక పాఠశాలలో ‘శిక్షా మిత్రా’ లేదా పారా టీచర్ గా  పనిచేస్తోంది. యుపి పంచాయతీ ఎన్నికలలో తప్పనిసరి విధి తరువాత కోవిడ్ -19 తో మరణించిన 1,621 పాఠశాల ఉపాధ్యాయుల జాబితా లో ఆమె నంబరు 1,282. కానీ ఆమె ఐదుగురు కుటుంబ సభ్యుల జీవితాలలో మాత్రం మంజు నిషాద్, ఒక సంఖ్య కంటే చాలా ఎక్కువ.

ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. కుటుంబంలో ఆమెది ఒక్కటే సంపాదన. అది కేవలం నెలకు రూ.  10,000. కాంట్రాక్టుపై పనిచేసే, పదవీకాల భద్రత లేని శిక్షా మిత్రాకు చెల్లించే దారుణమైన మొత్తం ఇది. 19 సంవత్సరాలు అదే పదవి లో పనిచేసిన మంజు లాంటి వారికి టీచరు పనిచేసినా కానీ,  టీచరుకు సహాయకురాలిగానే  (లేదా ఉపాధ్యాయుల సహాయకురాలిగానే) వర్గీకరించబడుతుంది.

శిశుపాల్ కూలీగా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నాడు.“నేను పనిచేస్తున్న ఎక్స్‌ప్రెస్‌వే దశ రెండు నెలల క్రితం పూర్తయింది. సమీపంలో వేరే నిర్మాణ పనులు ఏమి జరగలేదు. గత కొన్ని నెలలుగా నా భార్య ఆదాయం పైనే కుటుంబాన్ని నడుపుకొస్తున్నాము.” అని చెప్పాడు

ఏప్రిల్ 15, 19, 26 మరియు 29 తేదీలలో జరిగిన యుపి యొక్క నాలుగు-దశల పంచాయతీ ఎన్నికలలో వేలాది మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విధిని కేటాయించారు. ఉపాధ్యాయులు మొదట ఒక రోజు శిక్షణ కోసం వెళ్లారు, తరువాత రెండు రోజుల పోలింగ్ పని కోసం. ఈ రెండు రోజులలో, ఒక రోజు తయారీ పని అయితే రెండవది ఓటింగ్ రోజు జరిగే పని. తరువాత మే 2 న ఓట్లను లెక్కించడానికి వేలాది మంది రిపోర్ట్ చేయవలసి వచ్చింది. ఈ పనులను నెరవేర్చడం తప్పనిసరి.  అంతేగాక, ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు విస్మరించబడ్డాయి.

యుపి శిక్షక్ మహాసంగ్ (టీచర్స్ ఫెడరేషన్) రూపొందించిన జాబితాలో - మరణించిన 1,621 ఉపాధ్యాయులలో  193 శిక్షా మిత్రాలు ఉన్నారు -. వీరిలో మంజుతో సహా 72 మంది మహిళలు ఉన్నారు. అయితే, మే 18 న, యుపి ప్రాథమిక విద్యా శాఖ విడుదల చేసిన ఒక పత్రికా నోట్‌ లో, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఉద్యోగంలో మరణించిన వారికి మాత్రమే ఏదైనా పరిహారం లభిస్తుంది. ఉపాధ్యాయుల విషయంలో, ఇది వారి విధి నిర్వహించే స్థలం వద్ద లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మరణించిన వారిని మాత్రమే సూచిస్తుంది. పత్రికా నోట్ చెప్పినట్లుగా: "ఈ కాలంలో ఒక వ్యక్తి ఏదైనా కారణంతో మరణిస్తే పరిహారం చెల్లించాలి, అది రాష్ట్ర ఎన్నికల సంఘం మంజూరు చేస్తుంది."

PHOTO • Courtesy: Shishupal Nishad

నవ్య, ముస్కాన్, ప్రేమ్ మరియు మంజులతో శిశుపాల్ నిషాద్: కుటుంబంతో కలిసి దిగిన చివరి ఫోటో

ఆ వ్యాఖ్యానాన్ని బట్టి, పత్రికా నోట్ ఇలా చెబుతోంది: "ముగ్గురు ఉపాధ్యాయుల మరణాలను జిల్లా నిర్వాహకులు రాష్ట్ర ఎన్నికల సంఘం [SEC] కు తెలియజేశారు." ఇది శిక్షణ, ఓటింగ్ లేదా లెక్కింపు వద్ద కరోనా  సోకిన  కొన్ని రోజుల తరువాత ఇంట్లో మరణించిన 1,618 మంది ఉపాధ్యాయులను మినహాయిస్తుంది. కరోనావైరస్ సంక్రమణ యొక్క స్వభావాన్ని దానివలన  ఎలా మరణంఎలా పొందుతారో, దానికి ఎంత సమయం  పడుతుందో  అనే  నిజాన్ని పూర్తిగా విస్మరించే విషయం ఇది.

శిక్షక్ మహాసంగ్ అపహాస్యం తో స్పందిస్తూ, అధికారులు వారి పూర్తి జాబితాను చూడాలని "ముగ్గురి మరణాన్ని మాత్రమే గురించారు అంటే మిగిలిన 1,618 మంది మరణాన్ని వారి జాబితా లో ఒకసారి సరిచూసుకోవాలి," అని మహాసంగ్ అధ్యక్షుడు దినేష్ శర్మ PARI కి చెప్పారు.

26 న జరిగే అసలు ఓటింగ్‌కు ముందు రోజు ఏప్రిల్ 25 న జలౌన్ జిల్లాలోని కడౌరా బ్లాక్‌లో పోలింగ్ సెంటర్ డ్యూటీ కి మంజు నిషాద్ రిపోర్ట్ చేశారు. దీనికి కొన్ని రోజుల ముందు ఆమె ఒక శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. కానీ  ఏప్రిల్ 25 రాత్రి ఆమె నిజంగా అనారోగ్యానికి గురైంది.

“ఇదంతా ప్రభుత్వ అజాగ్రత్త కారణంగా జరిగింది. నా భార్య ఎవరో ఉన్నత అధికారి వద్ద ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోసం ప్రయత్నించింది, కానీ ఆయన ‘మీకు సెలవు కావాలంటే, మీరు ఉద్యోగాన్ని వదిలివేయండి’ అన్నాడు. కాబట్టి ఆమె పనికి వెళ్ళడానికే నిర్ణయించుకుంది, ”అని శిశుపాల్ చెప్పారు.

అద్దె వాహనంలో ఓటింగ్ డ్యూటీ పూర్తి చేసిన ఆమె ఏప్రిల్ 26 అర్ధరాత్రి తిరిగి వచ్చింది. "ఆమెకు ఏదో ఇబ్బందిగా,  జ్వరంగా ఉందని చెప్పింది," అని అతను చెప్పాడు. మరుసటి రోజు ఆమె కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పుడు, శిశుపాల్ మంజును ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు  తీసుకువెళ్ళాడు, అక్కడ ఆమెకు ఒక వారం పాటు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని చెప్పారు - కానీ ఆసుపత్రిలో ఒక్క రాత్రికి వారు  రూ. 10,000 చెల్లించాలని చెప్పారు. సరళంగా చెప్పాలంటే: ఆమె ఒక్క రోజు ఆసుపత్రిలో  చికిత్స పొందాలంటే ఆమె తన పూర్తి నెల జీతం ఖర్చు పెట్టాలి. "ఇక  నేను ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాను" అని శిశుపాల్ చెప్పారు.

మంజు, తన పిల్లలు ఇంట్లో ఏమి చేస్తారో, ఏమి తింటారో అనే విషయాన్ని గురించే ఎక్కువ ఆందోళనపడింది అని ఆమె భర్త చెప్పాడు.   మే 2 న, ఆసుపత్రిలో ఆమె ఐదవ రోజు - ఆమె ఉద్యోగ ధర్మం ప్రకారం ఓట్లను లెక్కించే దినాన  ఆమె మరణించింది.

PHOTO • Courtesy: Shishupal Nishad
PHOTO • Courtesy: Shishupal Nishad

మంజును విధులకు హాజరు కమ్మని  వచ్చిన  లేఖ. ఏప్రిల్‌లో జరిగిన యుపి యొక్క నాలుగు-దశల పంచాయతీ ఎన్నికలలో వేలాది మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విధిని కేటాయించారు. మే 2 న, ఆసుపత్రిలో ఆమె ఐదవ రోజు - అంటే ఆమె విధి నిర్వహణ ప్రకారం  ఓట్లను లెక్కించే రోజు - మంజు (కుడి, ఆమె పిల్లలతో) మరణించింది.

“నా తల్లి మూడు రోజుల తరువాత గుండెపోటుతో మరణించింది. ఆమె ‘నా బహు (కోడలు) పోయినట్లయితే నేను బతికి ఉండి ఏం చేస్తాను’ అన్నదని శిశుపాల్  చెప్పారు.

అతను తన పిల్లలకు ఎలా పోషించాలో  అర్ధంకానట్లు ఉన్నాడు. నవ్యకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు - అక్క, 13 ఏళ్ళ ముస్కాన్, అన్న,9 ఏళ్ళ ప్రేమ్. వారు ఉండే ఇంటికి వారు ప్రతి నెల 1500 ఇవ్వాలి. ఇదంతా ఎలా ఎదుర్కోవాలో అతనికి తెలియదు: “నాకు ఏమీ అర్థం కావట్లేదు. నా మతి పనిచెయ్యట్లేదు - ఇంకొన్ని నెలల్లో నేను కూడా చనిపోతాను, ”అతను నిస్సహాయంగా చెప్పాడు.

*****

ఈ విషాదంతో పాటు, ఈ పరిస్థితి వలన శిక్షా మిత్రా వ్యవస్థ ఎంత దౌర్భాగ్యం గా ఉందో కూడా మనకు అర్ధమవుతుంది.  వివిధ రాష్ట్రాలలో ఉన్న ఈ పథకం, ఉత్తరప్రదేశ్‌లో 2000-01లో అమలులోకి వచ్చింది. ఈ ఉపాధ్యాయ సహాయకులను కాంట్రాక్టుపై నియమించడం అనేది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే తక్కువ ప్రాధాన్యత కలిగిన పిల్లల విద్యపై బడ్జెట్లను తగ్గించే మార్గం. ఉద్యోగాలు దొరకని పరిస్థితి లో నెలకు 10,000 రూపాయలకు పని చేయడానికి చాలామంది అర్హత ఉన్న వ్యక్తులు దొరుకుతారు. వీరికి ఇచ్చే ఈ పదివేల జీవితం మామూలు  టీచర్లకు చెల్లించే జీతంలో కొంత భాగమే.

శిక్షా మిత్రా  ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యాస్థాయిని దాటడం  అవసరం. మామూలు టీచర్ కన్నా  ఈ అర్హత బాగా తగ్గించబడిందనే సమర్ధన తో  ఈ దారుణమైన వేతనం ఇవ్వబడుతుంది. కానీ మంజు నిషాద్‌కు ఎంఏ డిగ్రీ ఉంది. ఆమెలాగే, వేలాది ఇతర శిక్షా మిత్రాలు ఈ పదవికి కావలసిన అర్హత కన్నా ఎక్కువ అర్హతనే  కలిగి ఉన్నారు. “వారు నిస్సందేహంగా దోపిడీకి గురవుతున్నారు. లేకపోతే, బి ఎడ్ మరియు ఎంఏ డిగ్రీలు, కొందరు పిహెచ్‌డిలు ఉన్నవారు 10,000 రూపాయలకు ఎందుకు పని చేస్తారు? ”అని దినేష్ శర్మ అడుగుతాడు.

మరణించిన ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది జాబితాలో జ్యోతి యాదవ్, 38 - నెంబర్ 750 ఉన్నారు. ఈమె ప్రయాగ్రాజ్ జిల్లాలోని సోరాన్ (సోరావ్ అని కూడా పిలుస్తారు) లోని ప్రాధమిక పాఠశాల తార్వైలో శిక్షా మిత్రాగా పనిచేశారు. ఆమెకు బిఇడి డిగ్రీ ఉంది పైగా ఈ సంవత్సరం జనవరిలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సిటిఇటి) లో ఉత్తీర్ణత సాధించింది. కానీ, మంజు నిషాద్ మాదిరిగా రూ. 10,000. సంపాదిస్తూ  15 సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలోనే  ఉన్నది.

PHOTO • Courtesy: Sanjeev Kumar Yadav

ఇంట్లో సంజీవ్, యాథార్త్ మరియు జ్యోతి: 'నేను ఆమెను [పోల్ శిక్షణ కోసం] అక్కడికి తీసుకువెళ్ళాను.  ఒక హాలులో భారీ సంఖ్యలో ప్రజలు ఒకరినొకరు తోసుకుంటున్నారు. శానిటైజర్లు లేవు, ముసుగులు లేవు, భద్రతా చర్యలు లేవు’

"నా భార్య పోల్ శిక్షణ ఏప్రిల్ 12 న ప్రయాగ్రాజ్ నగరంలోని మోతీలాల్ నెహ్రూ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది" అని ఆమె భర్త సంజీవ్ కుమార్ యాదవ్, 42 చెప్పారు. నేను ఆమెను [పోల్ శిక్షణ కోసం] అక్కడికి తీసుకువెళ్ళాను అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ  ఉన్నారు. శానిటైజర్లు లేవు, ముసుగులు లేవు, భద్రతా చర్యలు లేవు’ అని చెప్పాడు.

"మరుసటి రోజు ఆమె తిరిగి వచ్చేప్పటికే ఆమెకు అనారోగ్యం మొదలైంది. ఆమె 14 వ తేదీన డ్యూటీకి బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి (ప్రయాగరాజ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 15 న ఉంది), నేను ఆమె ప్రిన్సిపాల్‌ కి ఫోన్ చేసి ఇప్పుడు తాను ఎలా డ్యూటీ చేయగలదు, అని అడిగాను. దానికి అతను ‘ఏమీ చేయలేము, డ్యూటీ మాత్రమే చేయవలసి ఉంది.’ అన్నారు.  కాబట్టి నేను ఆమెను నా బైక్ మీద తీసుకెళ్లాను. నేను కూడా 14 వ రాత్రి ఆమెతో అక్కడే ఉండి, 15 వ తేదీన ఆమె డ్యూటీ ముగిశాక తిరిగి తీసుకువచ్చాను. ఆమె కేంద్రం నగర శివారులోని మా ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.” అన్నాడు

తరువాతి కొద్ది రోజుల్లో, ఆమె పరిస్థితి వేగంగా దిగజారింది. "నేను ఆమెను వేర్వేరు ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాను, కాని వారందరూ ఆమెను అనుమతించలేదు. మే 2 రాత్రి ఆమెకు  శ్వాస తీసుకోవడంలో  తీవ్రమైన ఇబ్బంది మొదలైంది. మే 3 న, నేను ఆమెను మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళాను, కాని ఆమె దారిలోనే మరణించింది. ”

కోవిడ్ -19 నుండి ఆమె మరణం కుటుంబాన్ని ముక్కలు చేసింది. సంజీవ్ కుమార్ వాణిజ్యంలో గ్రాడ్యుయేట్ మరియు యోగాలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న నిరుద్యోగి. అతను 2017 లో తాను పనిచేసే  టెలికాం సంస్థను మూసివేసే వరకు వరకు పనిచేసాడు. ఆ తరువాత, అతనికి  స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. అందువలన కుటుంబ ఆదాయానికి అతను పెద్దగా తోడ్పడలేదు. వారి ఆర్థికావసరాలని  జ్యోతి చూసుకునేది.

ఇప్పుడే 2 వ తరగతి పాసైన తన  తొమ్మిదేళ్ల కుమారుడు యథార్త్ కాక తనతో కలిసి ఉన్న వృద్ధ తల్లిదండ్రులను ఎలా చూసుకోగలనో అని సంజీవ్ ఆందోళన పడుతున్నాడు. "నాకు ప్రభుత్వం నుండి సహాయం కావాలి," అని అతను కన్నీళ్లతో చెప్పాడు.

PHOTO • Courtesy: Sanjeev Kumar Yadav

తొమ్మిదేళ్ల తన కొడుకు యథార్త్‌ను ఇప్పుడు తాను ఒక్కడే  ఎలా చూసుకోగలనో అని సంజీవ్ బాధపడ్డాడు

"రాష్ట్రంలో 1.5 లక్షల శిక్షా మిత్రాలు ఉన్నాయి, వీరు ఒక పదేళ్లుగా వారి వేతన స్కేల్‌లో భారీ మార్పులను చూశారు" అని దినేష్ శర్మ చెప్పారు. “వారి ప్రయాణం దురదృష్టకరం. వారు మొదట మాయావతి ప్రభుత్వ కాలంలో శిక్షణ పొందారు, మొదట్లో వారి జీతం రూ. 2,250. తర్వాత అఖిలేష్ కుమార్ యాదవ్ ప్రభుత్వంలో, వారికి రూ. 35,000 [ఇది దాదాపు 40,000 రూపాయల వరకు పెరిగింది] వచ్చింది. కానీ ఆ సమయంలో అర్హతలపై వివాదం రేగి, బి ఈడి డిగ్రీలున్న టీచర్లు  వ్యతిరేకించి ఈ విషయం పై సుప్రీమ్ కోర్టులో దావా వేశారు.

"భారత ప్రభుత్వం నిబంధనలను సవరించి ఉండవచ్చు. దశాబ్దాలుగా పనిచేస్తున్న మిత్రాస్ కోసం TET (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) ను క్లియరింగ్ చేయాలనే నిబంధనను  తొలగించి ఉండవచ్చు. కానీ వారు అలా చేయలేదు. కాబట్టి వారి జీతం అకస్మాత్తుగా తిరిగి  రూ. 3,500 కు చేరుకుంది, దానితో చాలామంది నిరాశతో తమ ప్రాణాలను తీసుకున్నారు. అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వారి జీతాన్ని నెలకు రూ .10,000 వరకు తీసుకువచ్చింది. ”

ఇంతలో, సిగ్గుపడేలా ప్రాథమిక విద్య డిపార్ట్మెంట్ యొక్క నోట్ లో  ఇప్పటివరకు ముగ్గురు ఉపాధ్యాయుల మరణాలు మాత్రమే పరిహార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పినందువలన  ప్రభుత్వం స్పందించవలసి వచ్చింది.

PARI మే 18 న నివేదించినట్లుగా, అలహాబాద్ హైకోర్టు రాష్ట్రం, పంచాయతీ ఎన్నికలలో విధుల తర్వాత కోవిడ్ -19 కారణంగా మరణించిన పోలింగ్ అధికారుల (ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు) కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా పరిహారంగా కనీసం కోటి రూపాయిలు ఇవ్వాలని ఆదేశించింది.

మే 20 న, "ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి" రాష్ట్ర ఎన్నికల కమిషన్తో సమన్వయం చేసుకొమ్మని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రభుత్వాన్ని ఆదేశించారు . అతను చెప్పినట్లుగా, "ప్రస్తుతం మార్గదర్శకాలు కోవిడ్ -19 వల్ల కలిగే ప్రభావాన్ని కవర్ చేయవు ... వాటి పరిధిలో ... సానుభూతితో కూడిన విధానాన్ని అనుసరించి మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉంది." రాష్ట్ర ప్రభుత్వం "తన ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉంది, ప్రత్యేకించి వారు ఎన్నికల్లో  లేదా మరే ఇతర విధుల నిర్వహణ చేసినా," అని ఆయన అన్నారు.

అయితే, టీచర్స్ ఫెడరేషన్‌కు చెందిన దినేష్ శర్మ ఇలా అన్నారు, “ప్రభుత్వం లేదా ఎస్‌ఇసి నుండి మా లేఖలకు ప్రతిస్పందన మాకు ఇంకా ఏమి రాలేదు. వారు ఎంత మంది ఉపాధ్యాయులను పరిశీలిస్తున్నారో, మార్గదర్శకాలలో ఏ మార్పులు చేస్తున్నారో మాకు తెలియదు. ”

ఏప్రిల్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో అమాయకత్వం ఉందని ప్రభుత్వం చేసిన వాదనను ఉపాధ్యాయులు అంగీకరించడం లేదు. "ఇప్పుడు సిఎం హైకోర్టు ఆదేశాన్ని పాటించి  ఎన్నికలు నిర్వహించామని చెప్తున్నారు. కానీ హైకోర్టు రాష్ట్రాన్ని లాక్డౌన్ చేయమని ఆదేశించినప్పుడు, అతని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే, కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ వేగంగా వెలువడుతోంది కాబట్టి  ఈ ప్రక్రియను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినప్పుడు, ప్రభుత్వం తిరిగి ఆలోచించి ఉండవచ్చు కానీ అలా చేయలేదు.”

"సుప్రీంకోర్టు, వాస్తవానికి,లెక్కింపును మే 2 న నిర్వహించడానికి బదులుగా 15 రోజుల వరకు వాయిదా వేయవచ్చా అని ప్రభుత్వాన్ని అడిగారు. వారు, రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదు. వారు హైకోర్టు గురించి మాట్లాడుతున్నారు - కాని లెక్కింపును వాయిదా వేసే సుప్రీంకోర్టు ప్రతిపాదనను తిరస్కరించారు . ”

*****

"ఏప్రిల్ 14 రాత్రి మమ్మీని ఇంటికి తీసుకువచ్చి 15 వ తేదీన, ఈ జిల్లాలో ఓటింగ్ రోజున ఆమెను తిరిగి డ్యూటీ కోసం తిరిగి పంపగలమా అని పోలింగ్ కేంద్రంలో డ్యూటీలో ఉన్న ప్రిసైడింగ్ అధికారిని నేను అడిగాను -" అని మొహమ్మద్ సుహైల్ ప్రయాగ్రాజ్ (గతంలో అలహాబాద్) నగరం నుండి ఫోన్ లో PARI కి చెప్పారు.

PHOTO • Courtesy: Mohammad Suhail

ఇష్టమైన కుటుంబ ఫోటో: పంచాయతీ ఎన్నికలలో తప్పనిసరి విధి నిర్వహణలో కోవిడ్ -19 కారణంగా ప్రయాగ్రాజ్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అల్వేదా బానో మరణించారు

అతని తల్లి, అల్వేదా బానో, 44, ప్రయాగ్రాజ్ జిల్లాలోని చకా బ్లాక్ లోని ప్రైమరీ స్కూల్ బొంగిలో ఉపాధ్యాయురాలు. ఆమె పోల్ డ్యూటీ సెంటర్ అదే బ్లాక్‌లో ఉంది. పంచాయతీ ఎన్నికలలో తప్పనిసరి డ్యూటీ తర్వాత కోవిడ్ -19 కారణంగా మరణించిన ఉపాధ్యాయుల జాబితాలో ఆమె సంఖ్య 731.

"ప్రిసైడింగ్ అధికారి నా విజ్ఞప్తిని తిరస్కరించారు, ఆమె రాత్రిపూట అక్కడే ఉండటం తప్పనిసరి అని అన్నారు. కాబట్టి మా అమ్మ ఏప్రిల్ 15 రాత్రి మాత్రమే తిరిగి వచ్చింది, నా తండ్రి అక్కడి సెంటర్ నుంచే ఆమెని  తీసుకువచ్చారు. ఆమె తిరిగి వచ్చిన మూడు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది, ”అని సుహైల్ చెప్పారు. మరో మూడు రోజుల తరువాత, ఆమె ఆసుపత్రిలో మరణించింది.

మొహమ్మద్ సుహైల్ కు  ఒక అక్క ఉంది మరియు ఆమె భర్తతో నివసిస్తుంది, అతని  తమ్ముడు - 13 ఏళ్ల మహ్మద్ తుఫైల్, 9 వ తరగతి చదువుతున్నాడు. సుహైల్ 12 వ తరగతి పూర్తి చేసాడు. ఇప్పుడు ఒక కళాశాలలో ప్రవేశం పొందాలని ఆశిస్తున్నాడు. .

అతని తండ్రి, 52 ఏళ్ల సర్ఫుద్దీన్, "లాక్ డౌన్ కు ముందు, గత సంవత్సరం ఒక చిన్న మెడికల్ స్టోర్ ను  ప్రారంభించాను" అని చెప్పారు, కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది కస్టమర్లు వస్తున్నారు . "నాకు కనీసం  రోజుకు  100 రూపాయల లాభం కూడా రాదు. మేము పూర్తిగా అల్వేదా కు వచ్చే రూ. 10,000. జీతం మీద ఆధారపడి ఉన్నాము ”

"35,000 రూపాయల వేతనంతో శిక్షా మిత్రాలను ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందినప్పుడు వారు అర్హత లేనివారుగా ప్రకటించారు [ఆ గ్రేడ్ చెల్లింపు కోసం]. ఇప్పుడు అదే శిక్షా మిత్రాస్ లో చాలా మంది అధిక అర్హతలు ఉన్నవారు ఒకే పాఠశాలల్లో నెలకు 10,000 రూపాయలకు బోధిస్తున్నారు - మరి ఇప్పుడు అర్హత గురించి ప్రశ్న లేదా చర్చ  ఎందుకు  లేదు? ” అని దినేష్ శర్మ అడుగుతాడు.

జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.

అనువాదం - అపర్ణ తోట

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Reporting and Cover Illustration : Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra