కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు-మోదీ సర్కార్ కార్పస్ ఫండ్-ఈ విషయంలో జగనే ముందు!

23 ఏళ్లు నిండాక కార్పస్ ఫండ్ చేతికి…

‘పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్’ పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.10లక్షలు కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఐదేళ్ల పాటు ప్రతీ నెలా వారికి స్టైఫండ్ అందిస్తుంది. పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చాక ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారికి అందిస్తారు. దాన్ని వ్యక్తిగత ఖర్చులకు,చదువులకు లేదా వృత్తిపరమైన అవసరాలకు.. ఎలాగైనా వాడుకోవచ్చు.’ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఉచిత విద్య,ఇతరత్రా ఖర్చులన్నీ ప్రభుత్వమే…

ఈ పథకం ద్వారా అనాథ పిల్లలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సైనిక్ స్కూల్స్,నవోదయ విద్యాలయాలు తదితర విద్యా సంస్థల్లో ఉచిత విద్య అందిస్తారు. ఒకవేళ చిన్నారులు వారి తాతలు లేదా ఇతర కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉంటే… వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయాలు లేదా ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ చిన్నారులు ప్రైవేట్ స్కూల్లో చేరితే వారి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే పీఎం కేర్స్ నుంచి అందిస్తుంది. చదువులకు మాత్రమే కాదు యూనిఫాం,పుస్తకాలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

విద్యా రుణాలపై వడ్డీ కూడా ప్రభుత్వమే…

ఈ పథకం వర్తించే పిల్లలు భవిష్యత్తులో ఇండియాలోనే ఉన్నత చదువులు చదవాలనుకుంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే వారికి విద్యా రుణాలు అందజేస్తారు. అయితే ఆ రుణాలపై వడ్డీని పూర్తిగా పీఎం కేర్స్ నుంచి ప్రభుత్వమే చెల్లిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్,వొకేషనల్ కోర్సులను అభ్యసించేవారికి పీఎం కేర్స్ ద్వారా స్కాలర్‌షిప్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇక ఈ పథకానికి అర్హులైన ప్రతీ చిన్నారికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షలు ఆరోగ్య భీమాను వర్తింపజేస్తారు.

ఏపీ,కేరళలో ఇదే తరహా పథకాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం(మే 29) నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను,సంరక్షకులను కోల్పోయిన ఎంతోమంది చిన్నారులకు ఈ పథకం లబ్ది చేకూర్చనుంది. నిజానికి ఇదే తరహా పథకాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్,కేరళ ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. కరోనాతో అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. డిపాజిట్‌పై వచ్చే వడ్డీతో అనాథ పిల్లల అవసరాలు తీర్చనున్నారు.ఇటీవలే రాష్ట్రంలో కొంతమంది అనాథ పిల్లలకు దీనికి సంబంధించిన బాండ్లను కూడా అధికారులు అందజేశారు.అటు కేరళ ప్రభుత్వం కూడా కోవిడ్‌తో అనాథలైన చిన్నారులకు రూ.3లక్షలు ఆర్థిక సాయాన్ని ఒకేసారి అందజేయాలని నిర్ణయించింది. అలాగే ఆ చిన్నారులకు ఉచిత విద్యతో పాటు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ప్రతీ నెలా రూ.2వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *