Andhra Pradesh
oi-Srinivas Mittapalli
రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కరోనా కట్టడి గురించి,ప్రజల గురించి ఆలోచించాల్సిన జగన్… ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుల అరెస్టులపై సీఎం జగన్ దృష్టి సారించడం శోచనీయం అన్నారు. గురువారం(మే 27) వర్చువల్‌గా జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
కోవిడ్ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం,తలకిందులైన కుటుంబ ఆదాయం అనే అంశంపై రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలని… బ్లాక్ ఫంగస్ నివారణకు వైద్య సదుపాయాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదే సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం పోటీ పడుతుంటే… సీఎం మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు.

కోవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్ 20 రెట్లు ప్రమాదకరంగా ఉన్నా కనీసం వ్యాక్సిన్లను తెప్పించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు లేఖలు రాసినంత మాత్రాన వ్యాక్సిన్ డోసులు పంపించరని… ముందుగా వారికి డబ్బులు చెల్లిస్తేనే వ్యాక్సిన్లు ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించి వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నారు. ప్రజా ధనాన్ని ప్రభుత్వం లూటీ చేస్తోందని ఆరోపించారు.
కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలుగుదేశం మహానాడు కార్యక్రమం వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలుత కోవిడ్ బారినపడి మృతి చెందిన నేతలు,కార్యకర్తలకు టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. కోవిడ్‌తో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలుగు జాతికి మహానాడు అంటే పండుగ రోజు అని అభిప్రాయపడ్డారు.
కోవిడ్ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ప్రభుత్వానికి సూచించినా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని… తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయినవారి సంఖ్యపై అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. ఆనందయ్య మందు పంపిణీపై నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అచ్చెనాయుడితో మొదలుపెట్టిన అక్రమ కేసుల పర్వం జనార్దన్ రెడ్డి వరకు వచ్చిందన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్ల డా.సుధాకర్,మాజీ మంత్రి కోడెల సహా ఎంతోమంది చనిపోయారని ఆరోపించారు.
English summary
TDP MP Rammohan Naidu has criticized the YSRCP government is completely failure in handling covid situations.He said it’s very unfortunate that CM Jagan focusing on arrests of opposition leaders instead of focusing on covid measures in the state.
Story first published: Thursday, May 27, 2021, 15:08 [IST]