
తీరం దాటినా తగ్గని యస్ తుపాను ముప్పు
ఈ ఉదయం ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటినా యస్ తుపాను ముప్పు మాత్రం ఇంకా తొలిగిపోలేదు. దీనికి కారణం ఇవాళ చంద్రగ్రహణం కావడమే. చంద్రగ్రహణం సమయంలో వాతావరణం, సముద్ర మట్టాలపై తీవ్ర ప్రభావం ఉండనుండటంతో పశ్చిమబెంగాల్, ఒడిశాతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. ఈ రోజు పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా కావడంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో తుపాను ముప్పు తప్పినా పూర్తిగా ప్రభావం తగ్గలేదని అర్దమవుతోంది. అయితే మరో మూడు గంటల్లో మాత్రం తుపాను బలహీన పడే అవకాశముందని అధికారులు ప్రకటించారు.

తూర్పు తీరంలో భారీ వర్షాలు
ఇవాళ చంద్రగ్రహణం ప్రభావంతో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఈ సమయంలో సముద్రంలో పెను మార్పులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల్లో వర్షపాతం అధికంగా ఉండొచ్చని అంచనా. దీంతో బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీని కూడా అప్రమత్తం చేస్తున్నారు. యస్ తుపాను ధాటికి ఇప్పటికే బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రగ్రహణం కూడా తోడవడంతో ఎలాంటి ముప్పు ఎదురవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

బెంగాల్లో కోటి మందిపై ప్రభావం
యస్ తుపాను కారణంగా ఒడిశా కంటే బెంగాల్ ఎక్కువగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. బెంగాల్లో కోటి మందిపై తుపాను ప్రభావం పడిందని, మూడు లక్షల ఇళ్లు నేలకూలాయని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. సాయంత్రం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్రంలో ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు. తుపాను ప్రభావంతో భారీగా చెట్లు కూడా నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు భారీగా జలమయం అయ్యాయి. బెంగాల్లో తుపాను కారణంగా కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తుపాను కారణంగా బెంగాల్, ఒడిశాకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి.