
రఘురామను ఎగదోసి..
దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పై సోమవారం విడుదలకానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈనెల 27న కీలక విచారణ జరుగనుంది. జగన్, సీబీఐల కౌంటర్ దాఖలుకు అది చివరి అవకాశం కావడం, ఆ రోజు రఘురామ బయటే ఉండబోతున్నప్పటికీ, సుప్రీం ఆంక్షల దరిమిలా మీడియాకు దూరంగా ఉండాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఎంపీ అరెస్టు తర్వాత ఆయనను ఎగదోసిన అసలు వ్యక్తులు ఎక్స్‌పోజ్ అయ్యారని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘ఆ ఎంపీ కేసుతో చంద్రబాబు, ఎల్లో మీడియాతోపాటు వారికి మద్ధతిస్తున్న శక్తులన్నీ ఎక్స్ పోజ్ అయ్యాయి. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రదారులు ఎవరు రెచ్చగొడితే ఎగిరి పడుతున్నారో ప్రజలకు బాగా అర్థమైంది. చట్టం చేతులు చాలా విస్తృతమైనవి. ఎవరెన్ని నాటకాలాడినా తప్పించుకోలేరు” అని ట్వీట్ చేశారు. అలాగే,

గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు
రఘురామ కంటే ముందు జగన్ సర్కారుతో పోరాడిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అనూహ్య రీతిలో గుండెపోటుకు గురై ప్రాణాలుకోల్పోవడం, ఆయన మరణాన్ని వైసీపీ హత్యగా టీడీపీ అభివర్ణించడం తెలిసిందే. దానికి కౌంటర్ గా చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నీకెందుకు నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు. మీడియా ముందు పులి వేషాలెయ్యమంటాడు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో? శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు? డాక్టర్ సుధాకర్ గుండెపోటు/కరోనాతో మరణిస్తే ప్రభుత్వం కోటి ఇవ్వాలంటున్నావ్. నీ వెన్నెపోటుకు బలైన ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? నీవు రెచ్చగొట్టడంతో సస్పెండ్ అయిన డా. సుధాకర్ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? వారి కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే నీ శవ రాజకీయాలేంటి?” అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ఒక ఎత్తయితే..

జులై 23న ఏపీలో ఏం జరగనుంది?
వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆదివారం(మే 23)నాటికి రెండేళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా జగన్ సర్కారు ఏపీకి చేసిన మేళ్లను పేర్కొంటూ గణాంకాలతో సహా ప్రకటనలు చేసిన సాయిరెడ్డి, ఒక ట్వీట్ లో మాత్రం అసాధారణ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జులై 23న శుక్రవారమని, ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలు కాబోతున్నదని జోస్యం చెప్పారు. ‘‘23వ తేదీ అంటేనే టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23న టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?” అని విజయసాయిరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది..