మూలికా వైద్యం పరీక్షకు నిలుస్తుందా? – ఎడిటర్స్ కామెంట్

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

ఆనందయ్య కషాయంపై చర్చించేముందు ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ బొమ్మలతో సాగుతున్న చర్చ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. ఆయన ఉన్నారా, పోయారా, ఉంటే ఆరోగ్యంగా ఉన్నారా, అలాగే ఉంటారా, ఇంకా దిగజారుతుందా అనేది అటూ ఇటూ తమ పాయింట్ నిరూపించుకోవాలనుకునే వారికి కొలమానంగా మారిపోయింది. బాగుంటే ఏదో రుజువు చేద్దామని కొందరు బాలేకపోతే ఇంకేదైనా అయితే ఇంకేదో రుజువు చేద్దామని కొందరు కాచుకు కూర్చున్నట్టుగా ఉంది.

Anandayya

ఈ రచ్చ అమానవీయంగా ఉంది. మీమీ పాయింట్స్ చర్చించుకోవడానికి మీకు అదొక నమూనా కావచ్చు. కానీ ఆయనకు ఆయన కుటుంబానికి ఇది నమూనా కాదు. అది ఆయన ప్రాణం. ఆ కుటుంబానికి అత్యంత సున్నితమైన విషయం. ఆ స్థానంలో మనల్ని మనం ఊహించుకుని చూస్తే తెలుస్తుంది.

రెండు శిబిరాలకు మధ్య సాగుతున్న చర్చలో ప్రధానమైన తేడా ప్రిన్సిపుల్‌కు సంబంధించింది. ఇలాంటి ఏదో ఒక ఉదాహరణ మీద ఆధారపడినది కాదు. ఒక మనిషి ఆరోగ్యం బాగుపడినంత మాత్రాన నాటుమందు సైంటిఫిక్ గా ఫ్రూవ్ అయినట్టు కాదు. ఒక వేళ అది వైద్యమే అయితే ఒక మనిషి ఆరోగ్యం దిగజారిపోయినంత మాత్రాన అది వైద్యం కాకుండా పోదు. ఆయన పేరు మీద సాగుతున్నది అనవసర రాద్ధాంతం.

ఆధునిక వైద్య శాస్ర్తం కానీ చట్టాలు కానీ ఆనందయ్య మందును అంగీకరించవనేది వాస్తవం. అది చివరకు ఆయుర్వేద సంస్థ ఆయుష్ పరిధిలో కూడా మందుగా గుర్తింపుపొందలేదనేది కూడా వాస్తవం. ఆయుష్ ఆ విషయాన్ని తేల్చిచెప్పింది కూడా. నాటు మందుగా గుర్తించారు అని కొందరు రాస్తున్నారు. నాటుమందు గుర్తింపు అనేది ఉండదు. ఇక్కడ నాటు అనే పదానికి శాస్త్రీయ గుర్తింపు లేనిది అనే విస్తృతార్థమున్నది తప్పితే ఫలానా గుర్తింపు అనే అర్థం లేదు. జనం ఒత్తిడి అధికంగా ఉన్నపుడు మందుకు గుర్తింపులేకపోతే ప్రసాదం అని పేరు మార్చుకుంటుంది. కాబట్టి మొత్తం చర్చ దాని చుట్టే నిలపడం మీద లాభం లేదు.

అక్కడికి వెళ్లే వాళ్లందరూ అజ్ణానులు, మూర్ఖులు అని తీసి సారేస్తే సరిపోతుందా, దాని చుట్టూ అల్లుకున్న ఇతరత్రా అంశాల మాటేమిటి? అందులోని సంక్లిష్టతల మాటేమిటి? వైద్య పరిభాషతో పాటుగా సామాజిక కోణం నుంచి కూడా దీన్ని చర్చించాల్సిన అవసరం ఉన్నది.

హేతువుకు విశ్వాసానికి, జ్ణానానికి అజ్ణానానికి మధ్య చర్చలాగా చూస్తే విషయం తీవ్రత అర్థం కాదు. విషయం అంత సింపుల్ కాదు. అంతకంటే సంక్లిష్టమైనది. అక్కడ ఎండలో ఎదురుచూస్తున్న ముప్పై వేలమంది, ఆ బాటలో ఎలాగైనా ఆ మందు సాధించాలనుకుంటున్న లక్షలాది మంది అందరూ ఆయుర్వేదం మీద తిరుగులేని నమ్మకమున్న వారే కానక్కర్లే. ప్రాణాలమీదకొచ్చినపుడు మనిషి ప్రవర్తన లాజిక్ దాటుతుంది.

ప్రాణం లాజిక్ కంటే విలువైనది కాబట్టి. లాజిక్ వల్ల హేతువు వల్ల ప్రాణం నిలుస్తుంది అనే భరోసా నూటికి నూరుశాతం ఉంటే తప్ప. ఒకప్పుడు చేయో కాలో విరిగితే ఎక్కువమంది పుత్తూరు కట్టుతో సరిపుచ్చుకునేవారు. ఇవాళ ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎక్కువమంది ఆధునిక వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. అలాగే పాము కాటు కూడా.

ఆధునిక వైద్యం విస్తరించే కొద్దీ అందుబాటులోకి వచ్చే కొద్దీ పాతకాలపు పాముల నరసయ్యలకు పనిలేకుండా పోయింది లేదా తగ్గిపోయింది. కానీ కోవిడూ దానికి ఆనందయ్య మందూ అంత సింపుల్గా తేల్చేసేది కాదు. చిన్నపుడు కాలికి గాయమైతే పిప్పెంటాకు నలిపి గుడ్డతో కట్టేది. లేదంటే కలబంద నారతో సరిపెట్టుకునేది. ఇవాళ అలా కాదు. ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ఇంకా గ్రామాల్లో అలా ఎవరైనా పిప్పెంటాకు కట్టుకుంటూ ఉంటే వారినందర్నీ అజ్ణానులు అని ఒక్క పదంతో తేలిగ్గా తీసిపారేయలేము. అది శాస్త్రీయంగా రుజువు కానిది అనే ఎరుక ఉన్నప్పటికీ.

గారడీలతో మోసాలు చేసే బాబాలను, గ్రామాల్లో తమకు తెలిసిన మూలికలతో ఏదో ప్రయోగాలు చేసే స్థానిక మూలికా వైద్యులను ఒక గాటన కట్టలేం. మోసం చేయడం వేరు. రుజువు కాని వైద్యం చేయడం వేరు. రుజువు కానిదల్లా మోసమే కానక్కర్లే. రెండూ వేర్వేరు విషయాలు. జనానికి ఉచితంగా పంచిపెడుతున్న ఆనందయ్య తనకు తెలిసిన దానితో నలుగురికి మేలు చేస్తున్నాననే భావనతో చేస్తుండొచ్చు.

ఇపుడు సాగుతున్న చర్చ ద్వంద్వాల్లో ఉంది. నువ్వు దొంగ అంటే నువ్వు గజదొంగ అని నిందించుకునేట్టు సాగుతున్నది. ఆయుర్వేదం సమర్థకులేమంటారు? ఇది సులభంగా మన ఇళ్లలోనూ చుట్టుపక్కలా దొరికే మూలికలతో పోయే జబ్బు. అదే ఇపుడీ ఆయుర్వేద డాక్టర్ ఇస్తున్నారు. అల్లోపతి వైద్యరంగం డబ్బుల కోసం కావాలనే దీన్ని కోతిపుండు బ్రహ్మండంలాగా చేస్తుంది అంటారు.

రోజుకో పరీక్ష పేరు చెపుతారు, పూటకో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంటారు. నాల్రోజులు పోయాక ఇది పనికి రాదు, ఇంకోటి అంటారు. ఇదంతా ఫార్మా కంపెనీల ఖజానా నింపడానికి ఆసుపత్రులను పోషించడానికి ఫార్మా వైద్యమాఫియా చేసే గారడీ అంటారు.

ఆనందయ్య మందు తీసుకున్న వారు కోలుకున్నారు. ఆక్సిజన్ శాతాలు మెరుగుపడ్డాయి. కావాలంటే వెళ్లి చూసుకోండి అంటారు. ఇంతమంది అనుభవాన్ని మీరు తీసేస్తారా తోసేస్తారా అని ప్రశ్నిస్తారు. వనమూలికలు పెరటి వైద్యాలు అనూచానంగా వస్తున్నాయి. మెడిసిన్ పరిభాషలో లేనంత మాత్రాన వాటిని పూర్తిగా తీసివేయడానికి లేదు అంటారు. కొంతమంది అల్లోపతి సమర్థకులను కార్పోరేట్ వైద్యపు ఏజెంట్లు అని కూడా నిందిస్తున్నారు. హీట్ అండ్ డస్ట్.

అల్లోపతి లేదా ఆధునిక వైద్యం వైపునుంచి మాట్లాడేవారేమంటారు. ఏవో కొన్ని అనుభవాలు కాదు, ఆధారం కావాలి, సైంటిపిక్ ఎవిడెన్స్ కావాలి అంటారు. సైన్స్ అనేదే ఎవిడెన్స్ బేస్డ్- డేటా బేస్డ్. అది మౌలిక మైన అంశం, అది లేకుండా దేన్నీ విశ్వసించడానికి లేదు అంటారు.

విశ్వాసాలమీద ఆధారపడి పొలోమని పొయ్యి కంట్లోనో ఒంట్లోనో మందు వేయించుకుంటే రేపు ఏదన్నా అయితే ఎవరిది బాధ్యత అంటారు. కొందరు ఏమిటీ అజ్ణానం, రుజువుల్లేని మందు కోసం వేలం వెర్రిగా పొలోమంటూ పోవడమేంటని విసుక్కుంటారు కూడాను. విసుగును దాటి అది చట్ట విరుద్ధం కాబట్టి చర్యలు తీసుకోవాలనేదాకా డిమాండ్లున్నాయి.

కోవిడ్ వ్యాధి సెకెండ్ వేవ్ తీవ్రత అనూహ్యంగా ఉంది. మరణాలు ఎక్కువున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే వాస్తవమరణాలు ఎక్కువున్నాయనేది బహిరంగ రహస్యం. తొలిదశలో కోమార్బిడిటీస్, వయసు, ఇట్లా ఏవో కొన్ని ఆనవాళ్లుండేవి తీవ్రతకు.

రెండో దశలో అవి లేని వాళ్లు కూడా పుటుక్కున వెళ్లిపోవడం చూస్తున్నాం. రెండో రోజే పోవచ్చు. లేదా ఆస్పత్రిలో రెండు వారాలుండీ పోవచ్చు. పోయే వాళ్ల సంఖ్య కోలుకున్న వాళ్లతే పోలిస్తే చాలాతక్కువే కావచ్చు. కానీ విడిగా చూసినపుడు వ్యాప్తి రీత్యా చూసినపుడు మరణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. బంధువులో సన్నిహితులో ఎవరో ఒకరి ఇంట మరణం చూడనివాళ్లము ఎవరమూ లేని స్థితి.

ముందుతరానికి ఈ తరానికి కూడా ఇంతకంటే పెద్ద గత్తర లేదు. స్వతంత్ర భారత దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య. ఒక వ్యాధి అనూహ్యంగా పరిణమించినపుడు పరిష్కారంపై పూర్తి భరోసా లేనపుడు ప్రత్యామ్నాయాలవైపు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రత్యామ్నాయ వైద్యం పరీక్షల మీద డేటా మీద ఆధారపడింది కాదు కాబట్టి ఆరోగ్య వ్యవస్థలో భాగం కాదుకాబట్టి అది ఏమైనా భరోసా ఇవ్వగలదు. ఏ ఆధునిక వైద్యుడూ ఇలాంటి రోగాల విషయంలో నూటికి నూరుశాతం భరోసా ఇవ్వరు. ఇవ్వలేరు.

ఆనందయ్య విజయం కేవలం ఆయనిచ్చే మందుమీద దాని విజయాల మీద ఆధారపడింది కాదు. జనంలో నెలకొన్న భయం, భరోసా లేని తనం, నిస్సహాయత మీద ఎక్కువ ఆధారపడింది.

ఆధునిక వైద్యం పూర్తి భరోసాతో నయం చేయగలిగితే దీని తాకిడి తగ్గుతుంది. ఆధునిక వైద్యశాస్ర్తం కోవిడ్ విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ తనను తాను మెరుగుపర్చుకుంటూ ఉన్నది. ఇంతవరకూ లక్షణాలను బట్టి ఫలానా పనిచేయొచ్చు అని మందులతో చికిత్స చేయడం తప్ప నిర్దుష్టంగా కోవిడ్‌కు ఇదే మందు అని కనుక్కో లేదు. మన డీఆర్డీవో మందు లాగా ప్రయోగాలైతే సాగుతున్నాయి.

రోగుల మీద ప్రయోగాలకు అనుమతులు కూడా ఇపుడిపుడే ఇస్తున్నారు.

ఇప్పటివరకూ ఇది కోవిడ్ మందు అని అధికారికంగా ఆధునిక వైద్యం మందును అందుబాటులోకి తేలేదు. వాక్సీన్స్ మాత్రమే వచ్చాయి ఇప్పటికైతే. దానికి తోడు ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్ మారుతూ ఉన్నాయి. మారతాయి. ఎందుకంటే ఆధునిక వైద్యం తనను తాను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ఉంటుంది.

నిర్దుష్టంగా వైద్యం లేని రోగం కాబట్టి చేసిన వైద్యం వచ్చిన ఫలితాల ఆధారంగా రకరకాల సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకుకంటుంది. అయితే మీడియాలో వీటి గురించి వచ్చే వార్తల వల్ల జనంలో కన్ఫూజన్ ఏర్పడుతుంది. నిర్దుష్టంగా వైద్యం లేని రోగానికి ప్రత్యామ్నాయం వైపు ఎందుకు చూడకూడదు అనిపిస్తుంది.

ప్రాణంతో ముడిపడిన వ్యవహారం కాబట్టి అది లాజిక్ ను దాటి క్రిష్ణపట్నం వైపు పయనిస్తుంది. క్రిష్ణపట్నం కాకపోతే ఇంకో వూరు. ఇంకో పేరు. పైగా కరోనా పేరుతో కొన్ని ప్రైవేట్ హాస్పటల్స్ లక్షలకు లక్షలు పిండుకుంటున్నపుడు, ప్రాణం పోసే సంజీవని అన్నట్టు స్థాయిని దాటి ప్రచారానికెక్కిన రెమ్‌డిసెవిర్ ఇంజెక్షన్లు బ్లాకులో వేలల్లో పలుకుతున్నపుడు, డబ్బు పలుకుబడి ఉన్నోళ్లు అవసరం కాని మాత్రలను ఇంజెక్షన్లను కూడా ఇళ్లల్లో ముందే కొని పెట్టుకుంటున్నపుడు, చుట్టుపక్కలా ఇంత డబ్బు భయంతో కలిసి ప్రవహిస్తున్నపుడు, అంత ప్రవహించినా ఫలితాలు లేని కొన్ని ఉదాహరణలు చూసినపుడు మనిషి ప్రాణభయంతో ఉన్న అన్ని ఆప్షన్స్ చూసే అవకాశముంది.

ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ ఉంటుందో లేక తెలీక భయంమాటున బతికేవారు ఆశగా కృష్ణపట్నం వైపు చూడడాన్ని మూర్ఖత్వం అని తిట్టిపోయలేం. ప్రాణభయంలో ఉన్నప్పటి అనుభవం వేరే ఉండొచ్చు. నూటికి ఎనభైమందికి పైగా హాయిగా ఆస్పత్రులనుంచి బయటపడుతున్నారు కదా అనే వైపు చూస్తే ఏర్పడే భరోసా కన్నా బయటపడని చిన్న సంఖ్య కలిగించే భయం ఎక్కువ. కారణాలు చాలా ఉన్నాయి. మూర్ఖత్వం అనేస్తే పోయేంత చిన్నది కాదు. బయటున్న వాతావరణం, రోజొక వార్త కలిగిస్తున్న గందరగోళం, ఇవ్వన్నీ డెస్పరేషన్‌ను మరింత పెంచుతాయి.

అయితే అది సైన్స్ అయిపోతుందా అంటే కాదు, కాలేదు. సైన్స్ ప్రతిపాదన, ప్రయోగం, రుజువులు, డేటా లతో ముడిపడింది. ఇలాంటి నాటుమందులు నమ్మకంతో ముడిపడినవి. ఇది మౌలిక మైన తేడా. చెన్నైలో కుడినీర్ కషాయపు పొడిని ప్రభుత్వమే పంపిణీ చేయలేదా అది సైన్స్ కాకపోతే ఎందుకు చేశారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చెన్నై ప్రభుత్వం దాన్ని మందు అని ప్రచారంచేయలేదు. రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది అని చెప్పింది.

మూలికావైద్యం ఎప్పటినుంచో ఉంది. సైంటిఫిక్ ప్రాసెస్లో మందు అనిపించుకోవాలంటే ఏళ్లూ వూళ్లూ పడుతుంది. అంతవరకూ జనం పోవాల్సిందేనా, మీకు మందు ఫలితం కావాలా, ప్రాసెస్ కావాలా అని కూడా విశ్వాసులు అడగబోతారు.

నిజమే, ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చేదాకా రానివారందరికీ ఆధారం ఇలాంటి మూలికా వైద్యులు. వాళ్ల చిట్కాలే. అటు ఆల్లోపతిని ఇటు మూలికా వైద్యాన్ని కలిపి కొట్టే ఆర్ఎంపిలు కూడా మనకు గ్రామాల్లో కనిపిస్తారు. ఒక మారుమూల గ్రామంలోని మనిషికి తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని సైంటిఫిక్ ప్రాసెస్లో మందు అనిపించుకోవడానికి తగిన యంత్రాంగం వ్యవస్థా ఉండని మాటా అందుకు వ్యవప్రయాసలు అయ్యే మాటా వాస్తవమే.

ఇవ్వన్నీ వాస్తవాలే. కానీ మందు అనేది మనుషుల ఆరోగ్యంతో ప్రాణాలతో ముడిపడిన వ్యవహారం. కాబట్టి పద్ధతులు పరీక్షలు తప్పవు. ఆధునిక వైద్యంలో మందులు ఆ పరీక్షలు దాటుకునే ముందుకు వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్‌తో సహా అన్నింటి వివరణా ఉంటుంది. ఏఏ కేటగిరీల వాళ్లు ఎలా వాడాలో ఉంటుంది.

బోలెడంత ప్రాసెస్ ఉంటుంది. అదేదీ లేకపోతే ఈ మందు తీసుకున్న వేలాది మందికి రేపేదైనా అయితే బాధ్యులెవరు? కేవలం నమ్మకం మీద ఆధారపడి వదిలేసే అంశం కాదది. అవతల కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీ ఉంది కదాని దాన్ని పోటీ పెట్టి ఇంకోదాన్ని ఆమోదించాలనడం హేతుబద్ధం కాదు. రామర్ పిల్లై విషయంలో కూడా ఈ చర్చ బోలెడంత సాగింది.

ఇదొక ప్రత్యేక కేసుగా తీసుకుని సంస్థలు త్వరగా ఈ కషాయం ఔషధం అవుతుందో కాదో నిగ్గు తేల్చాలి. ఒక వేళ ఇది నిజంగా పనిచేసేట్టయితే ఇవాళ మానవాళికి అంతకన్నా కావాల్సింది ఇంకేముంది!

ఇలాంటి మూలికా ప్రయోగాలు దేశం నలుమూలలా ఉండే అవకాశం ఉంది కాబట్టి అదొక స్థాయిని దాటితో సంస్థలకు కష్టం కావచ్చు, అది వేరే విషయం. సంప్రదాయ వైద్య విధానాలను వేగంగా పరీక్షించే ఏర్పాట్లు అయితే ఉండాలి. సంప్రదాయ వైద్యం ఈ పరీక్షలకు సిద్ధపడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary

Does herbal medicine stand the test of time

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *