కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా.. వేసుకోకపోయినా..
వైరస్ వ్యాప్తి కట్టడికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటితోపాటు వైరస్ వ్యాప్తిని అరికట్టి, మహమ్మారిని అణిచివేద్దామని పిలుపునిచ్చింది. దేశంలో మహమ్మారి వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా.. వేసుకోకపోయినా.. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్ తోపాటు ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచుకోవాలని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుందని తెలిపింది. సాధారణంగా ఇంట్లోని కిటికీలు, తలుపులు, ఎగ్జాస్ట్ సిస్టమ్స్ తోపాటు దుర్వాసనలు బయటకు వెళ్లాయని, అదే ఆ ప్రాంతంలో ఫ్యాన్లు అమరిస్తే వైరస్‌తో కూడిన గాలి కూడా బయటకుపోయి ప్రమాదం తగ్గుతుందని నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
నోటి తుంపర్లతోనే ఎక్కువ ప్రమాదం
సాధారణంగా కరోనా బాధితులు మాట్లాడటం, తుమ్మడం, దగ్గడం, నవ్వడం లాంటివి చేసినప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తాయని, ఇందులో రెండు రకాలుంటాయని పేర్కొంది. పెద్ద పెద్ద తుంపర్లు నేరుగా భూమి ఉపరితలం మీదకు పడతాయని, అలా పడిన ప్రదేశాలను ఇతరులు ముట్టుకుని, అదే చేతులతో ముఖం, నోటిని తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే ఇంటిలోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం(శానిటైజ్) చేసుకోవాలని, చేతులను సబ్బు, శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచించింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి సుమారు 2 మీటర్ల వరకు తుంపర్లు వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంది.
వెంటిలేషన్ ఉండాల్సిందే..
అయితే, చిన్న చిన్న గాలి తుంపర్లు దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయని, ఎప్పుడూ మూసివుంచే గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపింది. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడంతోపాటు ఫ్యాన్లు ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని సూచించింది.
కరోనా కట్టడికి డబుల్ మాస్క్..
సెకండ్ వేవ్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రెండు మాస్కులు ధరిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వెల్లడించింది. సర్జికల్ మాస్క్ ఒక్కటే పెట్టుకున్నట్లయితే.. దాన్ని ఒకేసారి ఉపయోగించాలి. డబుల్ మాస్కుతోపాటు దాన్ని వాడినప్పుడు కనీసం 5 సార్లు ఉపయోగించుకోవచ్చు. అయితే, పెట్టుకున్న ప్రతీసారి దాన్ని ఎండలో ఆరబెట్టాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరిన్ని కరోనా టెస్టులు పెంచాలని, కరోనా కట్టడికి తాము సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.