Warangal
oi-Shashidhar S
ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం అవుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు స్త్రీనిధి ద్వారా రూ.50లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి అన్నారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం స్త్రీనిధి ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎంజీఎం-5, రాయపర్తి-4, పర్వతగిరి-4, దేవరుప్పల-4, కొడకండ్ల-3, పాలకుర్తి-3, తొర్రూర్-10 ఆస్పత్రులకు పంపిణీ చేశారు.

వైద్యరంగం బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషిచేస్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధనంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉపకేంద్రాలు, 40 ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మంజూరు చేశారన్నారు. కొవిడ్ బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు బదులు ప్రభుత్వ ఆస్పత్రులలో చేరి చికిత్స పొందాలని కోరారు. వరంగల్ ఎంజీఎంలో కొవిడ్ చికిత్సకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజారోగ్యం భేషుగ్గా ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి కావాల్సిన కరోనా వ్యాక్సిన్ కేంద్రం సరిగా సరఫరా చేయడం లేదన్నారు. ప్రధానికి గుజరాత్ తప్ప.. ఏ రాష్ట్రం కనిపించడం లేదన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించడానికే రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు రాజీవ్‌గాంధీ హనుమంతు, రూరల్ కలెక్టర్ హరిత, వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్, నోడల్ అధికారి శ్రీనివాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి, టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
English summary
solved oxygen deficit in the state minister errabelli dayakar rao said.
Story first published: Friday, May 21, 2021, 1:42 [IST]