
తొలి డోసు తీసుకున్నదెవరంటే..?
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తొలి డోసును దీపక్ సప్రా అనే పారిశ్రామికవేత్త తీసుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో- దీపక్ సప్రాకు స్పుత్నిక్ వీ తొలి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. మియాపూర్‌లోని కస్టమ్స్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌గా ఆయన పనిచేస్తోన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయనకు టీకా వేశారు. అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 91 శాతం ఎఫీషియన్సీని కనపర్చినట్లు తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లతో పోల్చుకుంటే దీని సామర్థ్యం ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ వల్ల పెరిగిన ధర..
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ధరను రూ.995.40 పైసలుగా నిర్ధారించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. డోసు ఒక్కింటికి రూ.995.40 పైసలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి- డోసు ఒక్కింటికి 948 రూపాయలతో దిగుమతి చేసుకుంటున్నామని రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. దీనిపై అదనంగా అయిదు శాతం మేర జీఎస్టీని చెల్లించాల్సి రావడంతో దీని ధర రూ.995.40 పైసలకు చేరినట్లు వివరించింది. మున్ముందు ఈ రేటు తగ్గే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ తొలి డోసు కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
5% జీఎస్టీ విధించడంపై భగ్గుమంటోన్న నెటిజన్లు..
కరోనా వైరస్ బారిన పడి విలవిల్లాడుతోన్న లక్షలాది మంది ప్రాణాలను నిలిపడానికి ఉద్దేశించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం అయిదు శాతం జీఎస్టీ విధించడం పట్ల నెటిజన్లు భగ్గుమంటున్నారు. కేంద్రంపై మండిపడుతున్నారు. ప్రత్యేకించి- కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలను సంధిస్తున్నారు. కరోనా వల్ల అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎదుర్కొంటోన్నాయని, దీనివల్ల సాధారణ ప్రజల జీవితం అస్తవ్యస్తమైందని, ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణాలను నిలిపే వ్యాక్సిన్‌పై అయిదు శాతం జీఎస్టీ విధించడం ఏమాత్రం సరికాదని అంటున్నారు.
ఆ నిధులను ఏం చేస్తారు?
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై అయిదు శాతం జీఎస్టీని అధికంగా విధించడం వల్ల వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తారని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గాల్లో మాయం చేసినట్టుగా మళ్లీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తారా? అని నిలదీస్తున్నారు. జీఎస్టీ వల్ల ఒక్కో డోసుపై సుమారు 47 రూపాయలను అధికంగా చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. కోట్లాది డోసుల ఇంజెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సి ఉన్నందున.. ఈ మొత్తం అదనపు భారంగా మారుతుందని, దీన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల సీతారామన్ చొరవ చూపించాలని కోరుతున్నారు.