షాకింగ్ : కోవిడ్ వార్డులో మహిళా పేషెంట్‌పై రేప్… మృతి చెందిన బాధితురాలు…

National

oi-Srinivas Mittapalli

|

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా కోవిడ్ పేషెంట్‌పై ఓ పురుష నర్సు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసిన భోపాల్ పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం… భోపాల్‌కు చెందిన 43 ఏళ్ల మహిళ కరోనా బారినపడి ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమెపై పురుష నర్సు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే వైద్యులు వెంటిలేటర్‌ పైకి షిఫ్ట్ చేశారు.

Covid Patient Raped By Nurse In Bhopal Hospital, Died In 24 Hours

బాధితురాలి ఫిర్యాదు మేరకు భోపాల్‌లోని నిషత్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన వివరాలేవీ బయటకు రాకుండా గోప్యత పాటించాలని బాధితురాలు పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కేవలం దర్యాప్తు బృందానికి తప్ప ఎవరికీ ఆమె వివరాలు వెల్లడించలేదు. అప్పటినుంచి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సంతోష్ అహిర్వార్(40)ను తాజాగా అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండుపై అతన్ని భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

కానీ అత్యాచార ఘటన జరిగిన 24 గంటల్లోపే బాధితురాలు మృతి చెందారు. 1984 నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఇప్పుడిలా మృతి చెందడం విషాదకరం. ఈ ఘటనపై భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల సంఘం మధ్యప్రదేశ్ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని కోవిడ్ వార్డుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు,అత్యాచార ఘటన బయటకు రాకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం అన్ని విధాలా ప్రయత్నించిందని ఆరోపించింది.

కాగా,సాధారణ వ్యక్తులతో పోలిస్తే భోపాల్ గ్యాస్ బాధితులను కరోనా కబళించే ప్రమాదం ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆ సంఘం ఉన్నతాధికారులకు రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. ఇకనైనా కోవిడ్ వార్డుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

English summary

A coronavirus patient was raped by a male nurse at a government hospital in Bhopal and died within 24 hours, the police said on Thursday, in a shocking incident made public only after a month following the arrest of the suspect.

Story first published: Friday, May 14, 2021, 1:49 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *