
టీఎన్ఆర్ చివరి మాటలు…
‘మొన్న నీతో మాట్లాడుతున్నప్పుడే కాస్త బాగా లేకుండే… ఫీవర్ వచ్చినట్లయింది నిన్న,ఇవాళ… ఫీవర్ అంటే ఫీవర్‌లా కూడా కాదు… నీరసంగా ఉంది… ఏమీ తినట్లేదు.. తినబుద్ది కావట్లేదు.. జ్యూస్‌లు తాగుతున్నా… ఈ టైమ్‌లో ఎందుకిప్పుడు అనిపిస్తుంది… పదో తారీఖు తర్వాత పెట్టుకోగలిగితే… ప్లాన్ చేద్దాం.. ఎందుకు రిస్క్ అని… కానీ అప్పటివరకు నువ్వు ఆగగలవా… ఇంటర్వ్యూలు కూడా క్యాన్సిల్ చేసేశాను… వారికి చెప్పలేదు కానీ కొద్దిగా ఆలస్యంగా పెట్టుకుందామని చెప్పాను.. చూద్దాం ఈ ఒకటి రెండు రోజుల్లో క్యూర్ అయితే బాగుంటుంది… అది చెబుదామనే ఫోన్ చేశా…’ అంటూ ఓ వ్యక్తితో టీఎన్ఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

జాగ్రత్తగా ఉండాలంటూ గతంలో ఓ వీడియో
కరోనా మొదటి వేవ్ నేపథ్యంలో గతంలో టీఎన్ఆర్ చెప్పిన జాగ్రత్తలను కూడా చాలామంది గుర్తుచేసుకుంటున్నారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నేను మీ టీఎన్‌ఆర్. ఎక్కడికీ వెళ్లడం లేదు. మంచి పుస్తకాలు చదువుతున్నా. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని మన పెద్దలు చెబుతారు కదా. ఈ కష్ట సమయమన్నది నాకు మంచి అలవాటు నేర్పింది. అదే ప్రాణాయామం.. యోగా. రోజూ ప్రాణాయామం చేస్తున్నా. నా పిల్లలతో కూడా చేయిస్తున్నా. ఈ సమయంలో పిల్లలతో బాగా గడపండి. వాళ్లకు మంచి విషయాలు చెప్పండి. భవిష్యత్‌లో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో వివరించండి. వాళ్ల పనులు వాళ్లే సొంతంగా చేసుకునేలా తీర్చిదిద్దండి.తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో ఉంటే కరోనా ఏమీ చేయదు. దయచేసి రూమర్స్ నమ్మకండి. నెగెటివ్ వీడియోలు చూడకండి. కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీ పెంచుకోండి. మనం మానసికంగా కుంగిపోతే, మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. అందరూ జాగ్రత్తలు పాటిస్తూ, కరోనాను జయిద్దాం..’ అంటూ గతంలో ఓ వీడియో సందేశంలో టీఎన్ఆర్ పేర్కొన్నారు.

టీఎన్ఆర్ కెరీర్ సాగిందిలా…
49 ఏళ్ల టీఎన్ఆర్ స్వగ్రామం మంచిర్యాల జిల్లా పౌనూరు గ్రామం. సినిమాల్లో తన ప్రయాణం మొదలుపెట్టాలన్న ఉద్దేశంతో 1990లలోనే హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేశారు. కెరీర్ ఆరంభంలో ప్రముఖ నటుడు,రచయిత ఎల్బీ శ్రీరామ్ వద్ద సహ రచయితగా పనిచేశారు. ఆ తర్వాత పలు టీవీ ఛానెళ్లలో క్రైమ్ ఎపిసోడ్లకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. గత కొన్నేళ్లుగా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ తన ప్రతిభ చాటుతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 20 సినిమాల్లో నటించారు. త్వరలోనే దర్శకత్వం చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇంతలోనే ఆయన కరోనాకు బలవడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.