నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు…
అది బిహార్‌లోని చౌసా పట్టణం… గంగా నది ఒడ్డున ఉంటుంది… ఎప్పటిలాగే తెల్లవారింది… స్థానికులు గంగా నది ఒడ్డున కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు… ఒకటి కాదు,రెండు కాదు కుప్పలు తెప్పలుగా కుళ్లిపోయిన మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చాయి… బహుశా అవన్నీ ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చిన కోవిడ్ పేషెంట్ల మృతదేహాలేనని స్థానిక అధికారులు భావిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు లేదా కాల్చేందుకు శ్మశానాల్లో,దహనవాటికల్లో ఎక్కడా స్పేస్ లేకపోవడంతో ఇలా నదిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కుళ్లిపోయిన స్థితిలో 45 మృతదేహాలు
‘దాదాపు 40-45 మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చాయి… నాలుగైదు రోజుల పాటు నీళ్లల్లో నాని ఉండటం వల్ల అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి… ఇవన్నీ ఎక్కడినుంచి వచ్చాయో విచారణ జరపాల్సిన అవసరం ఉంది… యూపీలోని బహ్రయిచ్ లేదా వారణాసి లేదా అలహాబాద్ నుంచి కొట్టుకుని వచ్చి ఉండవచ్చు. స్థానికంగా అయితే మృతదేహాలను ఇలా నదిలో పడేసే సంప్రాదాయం లేదు.’ అని చౌసా పట్టణానికి చెందిన ఉపాధ్యాయ్ అనే అధికారి వెల్లడించారు.
ఎందుకిలా చేస్తున్నారు…
కుప్పలు తెప్పలుగా కొట్టుకొచ్చిన ఆ మృతదేహాలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. వాటి నుంచి ఎక్కడ ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనన్న భయం వారిలో నెలకొన్నట్లు చెప్పారు. కుళ్లిపోయిన ఆ మృతదేహాల చుట్టూ కుక్కలు చేరుతున్నాయని… వాటిని ఖననం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా మృతుల మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు రూ.30వేలు నుంచి రూ.40వేలు వరకు ఖర్చవుతుందని… అంత స్థోమత లేని చాలామంది పేదలు శవాలను ఇలా నదిలో పడేస్తున్నారని అశ్విని వర్మ అనే సామాజిక కార్యకర్త పేర్కొనడం గమనార్హం.
యూపీ-బిహార్ బ్లేమ్ గేమ్..
తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని బక్సర్ జిల్లాకు బిహార్‌లోని చౌసా పట్టణం కేవలం 10కి.మీ దూరంలో ఉంటుంది. కాబట్టి ఈ మృతదేహాలన్ని యూపీ నుంచి కొట్టుకొచ్చినవేనని స్థానికులు బలంగా వాదిస్తున్నారు.
దహనవాటికల్లో వసూలు చేస్తున్న ఛార్జీలపై కూడా అధికారులు ఫోకస్ చేయాలని… దాన్ని నియంత్రించగలిగితే ప్రజలు ఇలా శవాలను నదిలో విసిరేయరని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం యూపీ-బిహార్ మధ్య బ్లేమ్ గేమ్‌లా మారిపోయింది. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని యమునా నదిలోనూ పాక్షికంగా కాలిన మృతదేహాలు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాచిపెడుతున్న కోవిడ్ మరణాలకు ఇవే సాక్ష్యం అమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.