
వ్యాక్సినేషన్ మరియు ఆక్సిజన్ కొరతపై టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మరియు ఆక్సిజన్ కొరతపై టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసన చేపట్టింది. అందులో భాగంగా టిడిపి నేతలు ఇళ్ల వద్దనే ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళనలో భాగంగా ఈరోజు మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే, తీసుకోవడం లేదని మండిపడ్డారు.

సీఎం జగన్ కరోనా కట్టడిపై కాలయాపన చేస్తున్నారని విమర్శలు
అంతేకాదు కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టకుండా సీఎం జగన్ కాలయాపన చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న సలహాలు తీసుకోకుండా తమపైనే విమర్శలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ముఖ్యం అని గట్టిగా చెప్పారు .అంతేకాదు కరోనా మృతుల బంధువుల ఆర్తనాదాలు సీఎంకు వినిపించడం లేదా? ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపులా అంటూ అచ్చెన్న సీఎం జగన్ ను నిలదీశారు.

సంపూర్ణ లాక్ డౌన్ పెడితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి
సంపూర్ణ లాక్ డౌన్ పెడితేనే ప్రజలు ప్రాణాలు నిలుస్తాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.సీఎం జగన్ పై మండిపడ్డ అచ్చెన్నాయుడు సీఎం జగన్ కరోనా కట్టడిలో విఫలమయ్యారని, చీము నెత్తురు ఉంటే జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చదువు రాని వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడే వారని అచ్చెన్న పేర్కొన్నారు. కేసుల భయంతో ప్రధాని నరేంద్ర మోడీని జగన్ పొగుడుతున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

ప్రజల చావుకు కారణం అవుతున్న జగన్ పై కేసులు పెట్టాలి
జగన్ పొరుగు రాష్ట్రాలను చూసి అయినా కరోనా కట్టడిని నేర్చుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో ఇటీవల చంద్రబాబుపై పెట్టిన కేసుపై స్పందించిన అచ్చెన్నాయుడు ప్రజల చావులకు కారణం అవుతున్న జగన్ పై కేసులు పెట్టాలని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా టీడీపీ నేతలు ఎక్కడి వాళ్ళు అక్కడే జగన్ పై విరుచుకుపడుతున్నారు . కరోనా కట్టడిపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.